Bail in rape case: రేప్ కేసులో నిందితుడికి బెయిల్, బాధితురాలికి కోర్టు షాకింగ్ ట్విస్ట్

Update: 2025-04-11 14:30 GMT

Bail in rape case: రేప్ కేసులో నిందితుడికి బెయిల్, బాధితురాలికి కోర్టు షాకింగ్ ట్విస్ట్

Rape case victim herself invited trouble: రేప్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పు నిందితుడి తప్పుతో పాటు నైతికంగా బాధితురాలు చేసిన తప్పును కూడా హైలైట్ చేసింది. అలాంటి తప్పు మరొకరు చేయకుండా ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఆ రేప్ కేసు ఏంటి? ఎక్కడ జరిగింది? బాధితురాలిని కోర్టు ఏమని మందలించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా కేసు పూర్వాపరాలను ఒకసారి తిరగేద్దాం.

2024 సెప్టెంబర్ 23న నొయిడాను ఆనుకుని ఉన్న గౌతంబుద్ధ్ నగర్‌లో ఎంఏ చదువుతున్న ఒక యువతి పోలీసులను ఆశ్రయించారు. తనను ఒక వ్యక్తి రేప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన కథనం ప్రకారం ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఉన్న ఒక బార్‌కు వెళ్లారు. అక్కడ ఆమె స్నేహితురాలికి తెలిసిన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి తెల్లవారిజామున 3 గంటల వరకు బాగా మద్యం సేవించారు.

స్నేహితురాలి ఫ్రెండ్ ఒకతను తనను అతని ఇంటికి రావాల్సిందిగా బలవంతపెట్టాడు. అప్పుడు తను మద్యం మత్తులో ఒంటరిగా ఇంటికి వెళ్లే పరిస్థితి లేనందున అతడితో కలిసి వెళ్లానని బాధితురాలు తెలిపారు. "కానీ అతడు ముందు చెప్పినట్లుగా నొయిడాలోని అతడి ఇంటికి తీసుకెళ్లకుండా గుర్‌గావ్‌లోని అతడి బంధువు ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు దారిపొడవునా తనపై చేయి వేసి తడమడం మొదలుపెట్టాడు. వాళ్ల బంధువు ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు" అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 2024 డిసెంబర్‌లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుండి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. నిందితుడు బెయిల్ పిటిషన్ కోసం హై కోర్టుకు వెళ్లాడు. ఇటీవల నిందితుడి బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్‌పై జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు.

నిందితుడి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, "బాధితురాలు చెప్పినవన్నీ నిజమేనని అనుకున్నప్పటికీ, తన క్లయింట్ రేప్ చేశాడని ఆరోపించడం సరికాదు" అని అన్నారు. అది ఆ ఇద్దరి మధ్య పూర్తి అంగీకారంతో జరిగిన చర్యగా పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ డిసెంబర్ నుండి జైల్లోనే మగ్గుతున్నాడని అన్నారు. తన క్లయింట్‌కు బెయిల్ వచ్చినా ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టడని వాదించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ, కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు. బెయిల్ మంజూరు చేసే క్రమంలో న్యాయమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు.

"బాధితురాలు చెప్పినదంతా నిజమేనని కోర్టు భావిస్తున్నప్పటికీ, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం చూస్తే ఆమె స్వతహాగా ఈ సమస్యను కొని తెచ్చుకున్నారని, జరిగిన పర్యావసనంలో ఆమె నైతిక బాధ్యత కూడా అంతే ఉందని భావించాల్సి ఉంటుంది" అని అన్నారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, వాంగ్మూలంలో పేర్కొన్న వివరాలు చూస్తేనే ఆ విషయం అర్ధమవుతోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

"బాధితురాలు ఒక పీజీ విద్యార్థిని అయ్యుండి ఆమె చేసిన పనేంటో ఆమే అర్థం చేసుకోగలరని  అనుకుంటున్నాను" అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాత్రివేళ బార్‌కు వెళ్లి తెల్లవారుజాము వరకు మద్యం తాగడం, మద్యం మత్తులో నిందితుడిని నమ్మి అతడితో కలిసి వెళ్లడం లాంటి అంశాలను ఉద్దేశిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, వైద్య పరీక్షల ప్రకారం చూసినప్పటికీ, ఆమె కన్నెపొర చినిగినట్లుగా ఉంది కానీ ఆమెపై లైంగిక దాడి జరిగినట్లుగా డాక్టర్లు ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదని న్యాయమూర్తి గుర్తుచేశారు. 

Most read interesting stories : జనం ఎక్కువగా చదివిన వార్తలు

Tags:    

Similar News