షిమ్లాలో అధికారులతో సీఎస్ హోలీ పార్టీ, ప్రభుత్వానికి రూ.1.22 లక్షల బిల్లు.. మండిపడుతున్న బీజేపి

షిమ్లాలో అధికారుల కుటుంబాలతో కలిసి సీఎస్ హోలీ సెలబ్రేషన్స్, ప్రభుత్వానికి రూ.1.22 లక్షల బిల్లు.. మండిపడుతున్న బీజేపి
CS's Holi party at Holiday Home Hotel in Shimla: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి తరువాత అధికార యంత్రాంగం తరపున ప్రజల సంక్షేమం కోసం పాటు పడాల్సిన ఉన్నత స్థాయి అధికారి. ప్రజా సంక్షేమంలో అధికార పార్టీకి, సీఎంకు ఎంత బాధ్యత ఉంటుందో, సీఎం ఆదేశాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయడంలో సీఎస్‌కు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం రాష్ట్రం లక్ష కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, అది తన సమస్య కాదన్నట్లుగా హోలీ సంబరాల కోసం తగలేసిన రూ. 1.22 లక్షలను చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి బిల్లు పెట్టుకున్నారు.
రాష్ట్ర ఖజానా నుండి చెల్లించాల్సిందిగా కోరుతూ సీఎస్ పెట్టిన ఆ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో రాష్ట్ర ప్రజల ముందే కాదు... దేశ ప్రజలు, నెటిజెన్స్ నుండి ఆ సీఎస్ విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఓవైపు తినడానికి తిండి లేక పేదలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు మీరు మీ సంబరాల కోసం, విలాసాల కోసం ఖర్చుపెట్టిన డబ్బును మళ్లీ ప్రజా ధనంలోంచే ఎలా తీసుకుంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తీరుపై రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మండిపడుతున్నారు. ఇలాంటి వారు చేయబట్టే ప్రజలకు బ్యూరోక్రాట్స్‌పై నమ్మకం, గౌరవం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాపై ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. 75 మంది ఆఫీసర్స్, వారి కుటుంబాలతో కలిసి షిమ్లాలో హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తోన్న ది హాలీడే హోమ్ లో హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల కోసం వారు రూ. 1,22,020 ఖర్చు చేశారు. అందులో ఒక్కో ప్లేటుకు రూ. 1000 లతో 75 మందికి లంచ్ ఆర్డర్ చేశారు. అంటే అక్కడికే రూ. 75,000 బిల్లు అయింది. దానిపై 10 శాతం సర్వీస్ చార్జెస్ వేశారు. అవి రూ. 7,500 అయ్యాయి. ఆపై రూ. 18 శాతం జీఎస్టీ చార్జ్ చేశారు.. అదొక రూ. 14,850 అయింది. ఇప్పటికే రూ. 97350 అయింది.
అంతటితో ఆగకుండా ఆ హోటల్ బిల్లులోనే ట్యాక్సీ చార్జీలు రూ. 11,800 కలిపారు. 22 మంది ట్యాక్సీల డ్రైవర్స్ లంచ్ కోసం మరో రూ. 12,870 చార్జ్ చేశారు. ఇలా అంతా కలిపి బిల్లు మొత్తం రూ. 1,22,020 అయింది. ఆ బిల్లును ప్రజాధనంలోంచి ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ హోటల్ బిల్లు సోషల్ మీడియాలో లీక్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సక్సెనా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. వాస్తవానికి మార్చి 31 తోనే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మరో 6 నెలలు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.
ఈ మొత్తం వ్యవహారంపై బీజేపి ఎమ్మెల్యే బిక్రం సింగ్ మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్రం లక్ష కోట్ల అప్పుల్లో ఉంది. అలాంటప్పుడు మీరు బాధ్యత లేకుండా ప్రజాధనంలోంచి విందులు, వినోదాల పేరుతో ఈవెంట్స్ కోసం లక్షలకు లక్షలు ఎలా ఖర్చుచేస్తారని నిలదీశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యుండి ఇలా వ్యవహరించడం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1964 చట్టానికి విరుద్ధం అవుతుందని అన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన వారే ఇలా ప్రజల డబ్బును నీళ్లలా ఖర్చుపెడితే ఎలా అని బీజేపి మండిపడుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.