Hate Speech: హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రిగారికి హైకోర్టు చివాట్లు!
Hate Speech: మంత్రిగా బాధ్యత వహిస్తూ ఇలా మాట్లాడటం రాజ్యాంగ ప్రమాణానికి వ్యతిరేకం కాదా?

Hate Speech: హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రిగారికి హైకోర్టు చివాట్లు!
Hate Speech: తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిపై హైకోర్టు కఠినంగా స్పందించింది. మత విశ్వాసాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 23లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. లేకపోతే కోర్టే సుమోటోగా కేసు నమోదు చేస్తుందని హెచ్చరించింది. ఈ తీర్పును న్యాయమూర్తి నంద్ వెంకటేశ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం పొన్ముడి ఓ సభలో మాట్లాడిన సందర్భంగా శైవులు, వైష్ణవులను, మహిళలను అశ్లీలంగా కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై పోలీస్ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా విమర్శించింది. హేట్ స్పీచ్ వ్యవహారాల్లో ప్రభుత్వం గట్టిగా స్పందిస్తే, అదే తీరుతో ఒక మంత్రి వ్యాఖ్యల విషయంలోనూ వ్యవహరించాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క ఎఫ్‌ఐఆర్ నమోదే సరిపోతుందని, అనవసరంగా మల్టిపుల్ కేసులు నమోదు చేయవద్దని సూచించింది.
ఈ వ్యవహారంపై వకీల్ జగన్నాథ్ అనే వ్యక్తి పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఆయన ఓ వైష్ణవ మత విశ్వాసి. ఆయన తన పిటిషన్‌లో, మంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను గౌరవించకుండా మాట్లాడడం రాజ్యాంగ ప్రమాణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. పొన్ముడి వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని అవమానించేలా, శైవ, వైష్ణవ ధర్మాలను మానభంగపర్చేలా ఉన్నాయని తెలిపారు.
ఇది కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదు, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. సభకు పోలీసుల అనుమతి ఉందా లేదా అనే అంశంపైనూ ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడి కారణంగా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదన్న అనుమానాన్ని కూడా ఆయన పిటిషన్‌లో లేవనెత్తారు.
పొన్ముడి గత వివాదాస్పద వ్యాఖ్యలను కూడా జగన్నాథ్ ప్రస్తావించారు. గతంలో అవినీతి ఆరోపణలపై ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన ఉపశమనం ఇచ్చిందని చెప్పారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసుల్లో మంత్రికి చెందిన రూ.14.21 కోట్ల ఆస్తులు జూలై 2024లో తాత్కాలికంగా అటాచ్ అయ్యాయని తెలిపారు. ఆయన ఖనిజశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన కుమారుడికి మైనింగ్ లైసెన్సులు మంజూరు చేసి, ఆ మొత్తాన్ని విదేశాల్లోకి పంపించారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొన్ముడిపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రివర్గ సహచరుడిని తప్పుపట్టారు. పార్టీ వర్గాలు పొన్ముడిని డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించినా మంత్రిగా కొనసాగుతున్నారనే వాస్తవాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.