కాబోయే అల్లుడితో వెళ్లిపోయిన అత్త స్టోరీలో కొత్త ట్విస్ట్... అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టు

Woman eloped with Wouldbe son-in-law
Woman eloped with Wouldbe son-in-law: తన బిడ్డను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తితో ఒక మహిళ ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంటి నుండి వెళ్లిపోయిన తమ కోసం పోలీసులు వెదుకుతున్నారని తెలుసుకున్న అత్త అనిత, అల్లుడు రాహుల్ తాజాగా తమ సొంతూరైన దాదోన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, జితేంద్ర కుమార్, అనిత దంపతుల బిడ్డ శివానికి రాహుల్ తో పెళ్లికి నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉండగా ఏప్రిల్ 6న అత్త, అల్లుడు ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇదే విషయమై అనిత భర్త జితేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య అనిత ఇంటి నుండి వెళ్లిపోతూ బిడ్డ పెళ్లి కోసం సిద్ధం చేసిన రూ.3.5 లక్షల నగదు, మరో రూ. 5 లక్షల విలువైన బంగారం కూడా వెంట తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం తెలిసిందే.
జితేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాబోయే అత్త, అల్లుడి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు.
అందుకే రాహుల్‌తో వెళ్లిపోయాను
పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని మీడియా ద్వారా తెలుసుకున్న అనిత, రాహుల్ వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన భర్త జితేంద్ర తనను రోజూ తాగి వచ్చి చాలా హింసించేవాడని, కొట్టేవాడని అనిత ఆరోపించింది. తన కూతురు శివాని కూడా తనతో వాగ్వాదం పెట్టుకుంటూ ఇబ్బంది పెట్టేదని చెప్పింది. ఇంట్లో అత్తమామలతో సహా అందరూ ఇబ్బంది పెట్టడం వల్లే తను రాహుల్ తో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయాను అని అనిత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.
అయితే, తన భర్త జితేంద్ర, కూతురు శివాని చెబుతున్నట్లుగా తను బంగారం, నగదు ఎత్తుకెళ్లలేదని అనిత చెప్పింది. కేవలం రూ. 200 నగదు, మొబైల్ ఫోన్ మాత్రమే వెంట తీసుకువెళ్లానని అనిత వెల్లడించింది. అంతేకాదు... అంతా అనుకున్నట్లే జరిగితే శివానిని పెళ్లి చేసుకుని రాహుల్ ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన వాడు. కానీ ఇప్పుడు అతడిని తనే పెళ్లి చేసుకుంటానని శివాని తల్లి అనిత తెగేసి చెబుతోంది.
కాబోయే అత్తతో అలా వెళ్లాల్సి వచ్చింది
ఏప్రిల్ 6 నాడు తనకు ఫోన్ చేసిన కాబోయే అత్త... అలీఘడ్ బస్ స్టేషన్ కు రాకపోతే తను చచ్చిపోతాను అని బెదిరించిందని రాహుల్ పోలీసులకు చెప్పాడు. ఆరోజు తను వెళ్లకపోతే ఆమె సూసైడ్ చేసుకుంటుందేమోననే భయంతోనే వెళ్లానని అన్నాడు. అంతేకాదు... అనిత చెప్పినట్లుగా వాళ్ల ఇంట్లో భర్త, అత్తమామలు అందరూ ఆమెని వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేకనే ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డట్లు చెప్పాడు. అలీఘడ్ బస్ స్టేషన్ నుండి ముందుగా లక్నో వెళ్లాం. అక్కడి నుండి ముజఫర్‌పూర్‌కు వెళ్లామన్నారు.
మరి అనితను పెళ్లి చేసుకుంటావా? రాహుల్‌ను ప్రశ్నించిన పోలీసులు
కాబోయే అత్తను తీసుకుని వెళ్లిపోయినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న రాహుల్ కు గ్రామపెద్దలు, పోలీసుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. అనితను పెళ్లి చేసుకుంటావా అనే ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు. కానీ కొద్దిసేపు ఆగిన తరువాత మళ్లీ స్పందిస్తూ అనితను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు.
ఆమెను ఇంట్లోకి రానిచ్చేది లేదు - జితేంద్ర కుటుంబం
అనిత తమ కుటుంబం పరువు తీసిందని, ఇంత జరిగాకా తమ ఇంట్లో ఆమెకు ఇక చోటు లేదని జితేంద్ర కుటుంబం చెబుతోంది. ఎత్తుకెళ్లిన బంగారం, నగదు తిరిగి ఇచ్చేసి వాళ్ల (అనిత, రాహుల్) దారి వారు చూసుకోవచ్చని జితేంద్ర కుటుంబసభ్యులు చెప్పారు. మొత్తానికి ఈ అత్త-అల్లుడు స్టోరీ వారికి సంబంధించిన అన్ని కుటుంబాలను నవ్వుల పాలయ్యేలా చేసింది. సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాల గురించి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Most read stories - ఎక్కువ మంది చదివిన వార్తా కథనాలు
- మరో వారం రోజుల్లో బిడ్డకు పెళ్లి పెట్టుకుని కాబోయే అల్లుడితో అత్త జంప్
- వినోద్ కాంబ్లీ కోసం క్రికెట్ లెజెండ్ ఆర్థిక సహాయం... BCCI పెన్షన్‌తో కలిపి ఇకపై నెలకు ఎంత వస్తుందంటే..
- రిటైర్మెంట్ రోజు లాస్ట్ ట్రిప్‌కు వెళ్లిన లోకో పైలట్... క్యాబిన్లో ఉండగా ఢీకొట్టిన గూడ్స్ రైలు
- Supreme Court: వక్ఫ్ సవరణల చట్టంపై సుప్రీం కోర్టు విచారణ... కేంద్రానికి వారం రోజుల గడువు
- పార్లమెంట్లో కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు JPC Report పై ఇంత రగడ ఎందుకు? ఫుల్ స్టోరీ
- Viral Video: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చివరి క్షణంలో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్న నితిన్