Supreme Court: వక్ఫ్ సవరణల చట్టంపై సుప్రీం కోర్టు విచారణ... కేంద్రానికి వారం రోజుల గడువు

Supreme Court: వక్ఫ్ సవరణల చట్టంపై సుప్రీం కోర్టులో విచారణ... కేంద్రానికి వారం రోజుల గడువు
Supreme Court about Waqf Amendment Act : వక్ఫ్ సవరణల చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందా అని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్స్ పై ఇవాళ సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరిగింది. బుధవారం నాటి విచారణకు కొనసాగింపుగా వాదనలు మొదలయ్యాయి. పిటిషనర్స్ తరపు న్యాయవాదులు, గవర్నమెంట్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు, పిటిషనర్స్ లేవనెత్తిన అభ్యంతరాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చిన కోర్టు... అప్పటివరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. అంతేకాకుండా వక్ఫ్ బోర్డులలో ఎలాంటి నియామకాలు చేపట్టరాదని తేల్చిచెప్పింది.
అయితే, వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్టుపై స్టే విధించాలని పిటిషనర్స్ చేసిన విజ్ఞప్తికి మాత్రం కోర్టు నో చెప్పింది. వక్ఫ్ సవరణల చట్టంపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
కేంద్రం వివరణ ఇచ్చిన తరువాత 5 రోజుల్లో పిటిషనర్స్ రీజాయిండర్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టంచేసింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ కే.వి. విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
మా న్యాయ పోరాటం కొనసాగుతుంది - అసదుద్దీన్ ఒవైసి
వక్ఫ్ సవరణల చట్టంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వక్ఫ్ సవరణల చట్టం బిల్లు దశలో ఉన్నప్పటి నుండే మేం వ్యతిరేకిస్తున్నామని అసదుద్దీన్ అన్నారు. "ఈ చట్టం వల్ల జరిగే నష్టాలను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇచ్చిన నివేదికలోనూ చెప్పాను. బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లోనూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. వక్ఫ్ సవరణల చట్టంపై తమ న్యాయపోరాటం కొనసాగుతుంది" అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.