Who is Justice BR Gavai: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా బీ.ఆర్. గవాయి... ఎవరీ గవాయి?

Who is Justice BR Gavai: సుప్రీం కోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13వ తేదీన ముగియనుంది. దీంతో కొత్త జస్టిస్ కోసం సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం నేడు న్యాయ శాఖకు ఒక సిఫార్సు లేఖను పంపింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ బీ.ఆర్. గవాయిని చీఫ్ జస్టిస్ పోస్ట్ కోసం సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
గతేడాది నవంబర్ 11న అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ పదవీ కాలం ముగియడంతో సంజీవ్ ఖన్నా ఆ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జస్టిస్ ఖన్నా స్థానంలో మే 13న జస్టిస్ బీ.ఆర్. గవాయి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎవరీ జస్టిస్ బి.ఆర్. గవాయి?
జస్టిస్ బీఆర్ గవాయి పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయి. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న ఆయన తొలిసారిగా బార్ అసోసియేషన్‌లో చేరారు. 1987-1990 మధ్య కాలంలో బాంబే హై కోర్టులో స్వతంత్రంగా లా ప్రాక్టీస్ చేశారు.
1990 తరువాత ముంబై హై కోర్టులోనే నాగపూర్ బెంచ్‌లో కేసులు వాదించే వారు. నాగపూర్ మునిసిపల్ కార్పొరేషన్, అమరావతి మునిసిపల్ కార్పొరేషన్, అమరావతి యూనివర్శిటీలకు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. ఇవేకాకుండా విదర్భ ప్రాంతంలోని పలు ఇతర మునిసిపాలిటీల తరపున కూడా గవాయి వాదనలు వినిపించే వారు.
1992 ఆగస్టు నుండి 1993 జులై వరకు బాంబే హై కోర్టు నాగపూర్ బెంచ్‌లోనే గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2000 సంవత్సరం జనవరి 14న అదే నాగపూర్ బెంచ్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రమోట్ అయ్యారు.
2003, నవంబర్ 14న బాంబై హై కోర్టులో అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. మరో రెండేళ్లకు... అంటే 2005 నవంబర్ 12న అదే బాంబే హై కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.
బాంబే హై కోర్టులో ఉన్నప్పుడే నాగపూర్, ఔరంగాబాద్, పనాజి బెంచ్‌ల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2019, మే 24న జస్టిస్ బి.ఆర్. గవాయి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. సుప్రీం కోర్టులోనూ అనేక కీలకమైన కేసులకు సంబంధించిన ధర్మాసనాల్లో ఆయన ముఖ్యుడిగా లేదా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆర్టికల్ 370, 2016 లో పెద్ద నోట్ల చలామణి రద్దు, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వంటి జఠిలమైన అంశాలను సవాలు చేస్తూ దాఖలైన కేసుల్లోనూ జస్టిస్ బీ.ఆర్. గవాయి కీలకంగా వ్యవహరించారు.
ప్రస్తుతం అటవీ, పర్యావరణం-పరిరక్షణ సమస్యలకు సంబంధించిన కేసులను కూడా గవాయి నేతృత్వంలోని ధర్మాసనమే విచారణ చేపడుతోంది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ జస్టిస్ బీ.ఆర్. గవాయి ఆదేశాలు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ జస్టిస్ బీ.ఆర్. గవాయి ఇవాళ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 100 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుపట్టిన గవాయి, ఆ స్థలాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలతో రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. లేదంటే చెట్ల నరికివేతకు బాధ్యులైన ఉన్నతాధికారులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా హెచ్చరించారు.