Waqf Amendment Act: హిందువుల ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా? కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న

Waqf Amendment Act: వక్ఫ్ సవరణల చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు... కేంద్రానికి సూటి ప్రశ్న
SC on Waqf Amendment Act: వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా చేసిన సవరణల్లో ముఖ్యంగా మూడు అంశాలపై కోర్టు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తింది. వక్ఫ్ బోర్డ్ చట్టంలో ఉన్న వక్ఫ్ బై యూజర్, ఇప్పటికే కోర్టు ధృవీకరించిన ఆస్తులను తిరిగి డీనోటిఫై చేయరాదని కోర్టు అభిప్రాయపడింది. చట్ట సభల్లో చట్టాలు చేసే వారికి కోర్టు తీర్పులను, కోర్టుల ఆదేశాలను మార్చే అధికారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది.
వక్ఫ్ ఆస్తుల వివాదంలో కలెక్టర్ ప్రోసిడింగ్స్‌ను కొనసాగించవచ్చని చెప్పిన కోర్టు... ఇకపై ఆస్తి హక్కు నిర్ణయం ఏదైనా కలెక్టర్ పరిధిలోనే ఉంటుందనే ప్రతిపాదనపై సంశయం వ్యక్తంచేసింది. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎక్స్-అఫిషియో మెంబర్స్ నియామకం జరగవచ్చేమో కానీ వక్ఫ్ బోర్డులో మిగతా వారు మాత్రం ముస్లింలే ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్రం వైఖరిని ప్రస్తావిస్తూ, " హిందువుల ట్రస్టులలో ముస్లింలకు చోటు కల్పిస్తారా మరి " అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
అయితే, సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలకు కేంద్రం స్పందించింది. "పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘమైన చర్చ చేపట్టిన తరువాతే ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది" అని కేంద్రం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీం కోర్టు
వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఆమోదం పొందిన తరువాత పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లు చెలరేగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వక్ఫ్ సవరణల చట్టానికి వ్యతిరేకంగా అక్కడి ముస్లింలు చేసిన ఆందోళనలు విధ్వంసానికి దారితీశాయి. ఈ అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయమై కోర్టు స్పందిస్తూ, ముర్షిదాబాద్ విధ్వంసకాండపై ఆందోళన వ్యక్తంచేసింది. ఆ అల్లర్లను దురదృష్టకరమైన ఘటనలుగా కోర్టు అభిప్రాయపడింది.
మధ్యంతర ఉత్తర్వులు జారీ
అంతిమంగా వక్ఫ్ సవరణల చట్టంపై చివరి నిమిషంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. చట్టాలపై ఇలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా అరుదైన పరిణామంగా పేర్కొన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా... ప్రస్తుత సందర్భంలో అలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని అన్నారు.