Randeep Guleria: థర్డ్ వేవ్‌పై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Randeep Guleria: థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండదన్న గులేరియా * పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపదు: ఎయిమ్స్ చీఫ్
Randeep Guleria: కోవిడ్ థర్డ్‌వేవ్ పిల్లలపై అధికంగా ప్రభావం చూపుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్న వేళ ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో పిల్లల్లో సరిపడా రోగ నిరోదకశక్తి ఉన్నట్లు గులేరియా పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ ఎఫెక్ట్‌తో మూతపడిన స్కూల్స్ తెరిచే సమయం వచ్చిందన్నారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలు తెరచు కోవచ్చని తెలిపారు. ఒక వేళ కేసులు పెరుగుతున్న ధోరణి కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకొని పాఠశాలలను మూసివేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాలలను రోజుమార్చి రోజు పెట్టడం, దశలవారీగా తెరవడం వంటి అంశాలపై ఆయా జిల్లాల యంత్రాంగం ఆలోచించవచ్చని ఎయిమ్స్ చీఫ్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. సామాజిక అంతరాల కారణంగా వర్చువల్ తరగతులను అందరు విద్యార్థులు సమానంగా పొందలేకపోతున్నట్లు గులేరియా పేర్కొన్నారు. విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం ముఖ్యమని, అందుకు పాఠశాలలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయని గులేరియా వ్యాఖ్యానించారు.
ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి విభాగమైన యూనిసెఫ్ కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న పలు వైరస్‌ల కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి సహజంగా పెరిగిందని ఎయిమ్స్ చీఫ్ వెల్లడించారు.
అటు.. కోవిడ్ థర్డ్‌వేవ్‌పైనా ఎయిమ్స్ చీఫ్ కీలక విషయాలు వెల్లడించారు. థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువేనని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధలను పాటిస్తూ పిల్లలను స్కూలు వైపు నడిపించాలని అభిప్రాయపడ్డారు. పిల్లలకోసం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ప్రాథమిక సమాచారం సైతం ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు. దీంతో వీలైనంత త్వరగా పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేసుకోవాలని గులేరియా సూచించారు.