అయోధ్య రామ మందిర నిర్మాణం 'పితృ పక్షం' ముగిసిన తర్వాత ..
అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం పక్షం రోజుల 'పితృ పక్షం' ముగిసిన తర్వాత సెప్టెంబర్..
అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం పక్షం రోజుల 'పితృ పక్షం' ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతుందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపే కాలాన్ని పితృ పక్షం అంటారు.
రామ్ జన్మభూమి స్థలంలో 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాబోతున్న ఈ గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ , టౌబ్రో సిద్ధంగా ఉందని చంపత్ రాయ్ చెప్పారు. ఈ సంస్థ ఎటువంటి రుసుము వసూలు చేయకుండా నిర్మాణాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాలను 100 అడుగుల లోతులో వేస్తారు. ఈ స్తంభాలు రాతితో మాత్రమే ఉంటాయి.. వీటిలో ఇనుమును ఉపయోగించరు. ఆ తరువాత ఈ స్తంభాలపై, మరొక పొర పునాదిని వేస్తారు. ఇక లార్సెన్ , టౌబ్రో నిర్మాణ సంస్థ ముంబై, హైదరాబాద్ నుండి అవసరమైన యంత్రాలను తరలించే పనిలో ఉంది. సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందుగానే కరోనా పరీక్షలు చేస్తారని చంపత్ రాయ్ అన్నారు.
ఈ వారం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రెండు లేఅవుట్లను ఆమోదించింది. అందులో ఒకటి మందిరం నిర్మాణానికి సంబంధించింది కాగా మరొకటి మొత్తం రామ జన్మభూమి క్యాంపస్ లే అవుట్. ఎంపిక చేసిన లే ఔట్లను సెప్టెంబర్ 4 న ట్రస్ట్‌కు అప్పగించింది. ట్రస్ట్ వెల్లడించిన దాని ప్రకారం, ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆలయ నిర్మాణానికి పునాది వేస్తారు..తద్వారా 1,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఆలయం ఉంటుందని చంపత్ రాయ్ అన్నారు. కాగా గత నెలలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి పునాది వేసిన సంగతి తెలిసిందే.