Rajya Sabha MP Amar Singh Passed away : రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్‌ కన్నుమూత

Update: 2020-08-01 13:55 GMT
రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్

Rajya Sabha MP Amar Singh Passed away : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్‌ (64) తుదిశ్వాస విడిచారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యహ్నం ఐసీయూలో మృతిచెందారు. గతంలో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌ అప్పటి నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్టు సమాచారం.

అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 జూన్‌లో కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో అమర్‌సింగ్‌ వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో కీలకంగా వ్యవహరించారు. 2010వ సంవత్సరంలో అమర్‌సింగ్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాజాగా 2016లో కూడా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.

అమర్‌సింగ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆయన ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపైనా స్పందించే వారు. అంతే కాదు ఆయన మృతి చెందడానికి ముందు కూడా ఈ రోజు మధ్యాహ్నం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్‌ పెట్టారు.

ఇక ప్రముఖ నాయకుడు అమర్‌ సింగ్‌ మరణం పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. అమర్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా సంతాపం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేవారని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ గుర్తుచేసుకున్నారు. అమర్‌సింగ్‌ మరణవార్త తననెంతో బాధించిందన్నారు.



Tags:    

Similar News