కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ఉభయ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉభయ సభల సమావేశాలకు హాజరయ్యే సభ్యులు తప్పనిసరిగా తమ కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలి. సభా సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులను అందజేయాలి. ప్రభుత్వం ఆమోదించిన ఆస్పత్రులు, లాబోరేటరీలు, లేదా పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్‌లో పరీక్షలు చేయించుకుని రిపోర్టు సమర్పించాలి. రిపోర్టును ఈ మెయిల్ ద్వారా రాజ్యసభ సెక్రటేరియట్‌కు పంపించాలి. రాజ్యసభ సభ్యుల సౌకర్యార్థం పార్లమెంట్ హౌజ్ ప్రాంగణంలో మూడు కోవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు శుక్రవారం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఉద్యోగులు, తమ విధుల్లో భాగంగా ఎంపీలతో సన్నిహితంగా మెలిగేవారు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని వెంకయ్య సూచించారు. కరోనా విజృంభన నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుల ఆరోగ్యమే ప్రాధాన్యంశంగా ఉన్నతాధికారులతో రాజ్యసభ చైర్మన్ ఇదివరకే సమావేశమై చర్చించారు. సభ్యుల మధ్య భౌతికదూరం పాటిస్తూ కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు వెంకయ్యనాయుడు.