అమెరికా నుంచి ఇండియాకు వస్తూ చైనాకు రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

Rajnath Singh: శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ అమెరికన్లతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్

Update: 2022-04-16 04:00 GMT

Rajnath Singh: భారత్- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త శాంతించినా గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులు ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడి నుంచే చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు హాని చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని చైనాకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. చైనా సరిహద్దులో భారత సైనికులు చూపుతున్న ధైర్యసాహసాలను ఆయన ప్రస్తావించారు. భారత సైనికులు ఏం చేశారో, మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో బహిరంగంగా చెప్పలేమన్నారు రాజ్ నాథ్ సింగ్. అయితే భారత్‌కు హాని కలిగితే మాత్రం ఎవరినీ విడిచిపెట్టదనే సందేశం వెళ్లిందని మాత్రం కచ్చితంగా చెప్పగలమన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఉద్భవించిందని, ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందని గర్వంగా చెప్పారు.

తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి డ్రాగన్ కంట్రీకి వార్నింగ్ ఇచ్చారు రాజ్‌నాథ్. 2020 మే నెలలో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్, చైనా సైన్యాల మధ్య లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన మొదలైంది. జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో ఇరు సేనలు ఘర్షణ పడిన తర్వాత ప్రతిష్టంభన తీవ్రమైంది. తూర్పు లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనా ఇప్పటివరకు 15 రౌండ్ల సైనిక చర్చలు నిర్వహించాయి. దీని కారణంగా గత సంవత్సరం పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున, గోగ్రా ప్రాంతంలో ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాయి.

ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్‌ అనుకూలంగా నిలిచిందన్నారు. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. జీరో-సమ్ గేమ్ దౌత్యాన్ని భారత్‌ విశ్వసించదన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్‌ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని విన్‌-విన్‌ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్‌ కోరుకుంటుందని వెల్లడించారు

Tags:    

Similar News