Rajiv Gandhi killer Nalini Attempts Suicide : రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహాత్యాయత్నం
Rajiv Gandhi killer Nalini Attempts Suicide : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహళేంది తెలిపారు. బెయిలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల పెరోల్‌పై కుమార్తె హరిత వివాహం కోసం ఆరు నెలలపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. కాగా, తోటి ఖైదీకి, నళికి మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు. అయితే, గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. విషయం తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారని, త్వరలోనే ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.