Rajasthan Political Crisis Updates: పైలట్ వర్గ ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళ తేలుతుందా?
Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరుగుతోంది. దీంతో సుప్రీంకోర్ట్ ఈ కేసులో ఏమి చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తీర్పు సచిన్ వర్గానికి అనుకూలంగా వస్తే మాత్రం ఎమ్మెల్యేపై అనర్హత ఉండకపోవచ్చు. లేదంటే గెహ్లాట్ కు అనుకూలంగా వస్తే మాత్రం సచిన్ పైలట్ భవిత్యవ్యానికే ప్రమాదం అవుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఈ విషయంలో కేంద్రాన్ని పార్టీగా చేర్చాలని పైలట్ క్యాంప్ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించిన సంగతి తేలిందే.
ఇక మరోవైపు ఆరుగురు బిఎస్పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ నిర్ణయాన్ని బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సవాలు చేశారు. ఈ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు విచారించనుంది, దీనిపై జస్టిస్ మహేంద్ర గోయల్ సోమవారం విచారణ జరపనున్నారు. ఇందులో అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీతో సహా బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కూడా పార్టీలుగా చేశారు. ఇదిలావుంటే మొన్నటివరకూ గవర్నర్ ను కలిసి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తాజాగా ఆయన వ్యూహం మార్చారు. ఆదివారం గవర్నర్ కు రాసిన లేఖలో జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే అందులో బలపరీక్ష అంశం మాత్రం పొందుపరచలేదు.