Rajasthan Political Crisis: రాజస్థాన్ శాసనసభలో నంబర్ గేమ్ ఎలా ఉందంటే?
Rajasthan Political Crisis: రాజస్థాన్ లో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. సచిన్ పైలట్ సహా 19 మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సిపి జోషిని అభ్యర్థించింది
Rajasthan Political Crisis: రాజస్థాన్ లో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. సచిన్ పైలట్ సహా 19 మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సిపి జోషిని అభ్యర్థించింది. దీంతో మంగళవారం రాత్రి తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్. ఒకవేళ కాంగ్రెస్ అనుకున్నట్టు 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే నంబర్ గేమ్ ఎలా ఉండబోతుంది? గెహ్లాట్ ప్రభుత్వానికి ఏమైనా ముప్పు ఉందా? ఈ పరిస్థితులలో బీజేపీ ఎలా ముందుకెళుతుందనేటువంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి.
వాస్తవానికి ఈ నోటీసులు ఇవ్వడం ద్వారా సచిన్ కోటరీలో ఎంతమంది ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, అది అంత బలంగా లేదనే చెప్పాలి. ఒకవేళ 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఇప్పటిదాకా మెజారిటీ సంఖ్యతో ఉన్న కాంగ్రెస్ కు తిప్పలు తప్పవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాజస్థాన్ శాసనసభలో 200 సీట్లు ఉన్నాయి. 2018 లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత ఉప ఎన్నికలో మరొక సీటు గెలిచింది. అప్పుడు ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ కోణంలో, కాంగ్రెస్ ప్రస్తుత బలం 107. పైలట్ క్యాంప్‌లో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. గెహ్లాట్ కు 88 మంది సభ్యుల మద్దతు ఉంటుంది. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్లయితే అప్పుడు సభలో మొత్తం సభ్యుల సంఖ్య 181అవుతుంది.. ఈ విధంగా చూసుకున్నా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 91 మంది సభ్యుల బలం అవసరం.
మరోవైపు 200 మంది సభ్యుల సభలో తనకు ఇంకా సంపూర్ణ మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెబుతున్నారు. 109 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవం ఏమిటంటే, 19 మంది రెబల్ ఎమ్మెల్యేలను తగ్గించిన తరువాత, 13 మంది స్వతంత్రులు ,ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలపై గెహ్లాట్ ఆధారపడటం మునుపటి కంటే కష్టంగా మారవచ్చు.
ఇద్దరు బిటిపి(భారత గిరిజన పార్టీ) ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా తెలియలేదు. ఇక ఇద్దరు సిపిఎం ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు ఓటు వేస్తారా లేదా? ఫ్లోర్ టెస్ట్ సమయంలో గైర్హాజరవుతున్నారా? అనేది కూడా స్పష్టంగా తెలియలేదు.
ఇక బిజెపికి విషయానికొస్తే అసెంబ్లీలో ఆ పార్టీకి సొంతంగా 72 మంది ఎమ్మెల్యేలు ఉంటే, హనుమాన్ బెనివాల్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. మొత్తం సంఖ్య 75 మంది ఎమ్మెల్యేలు. అటువంటి పరిస్థితిలో, గెహ్లాట్‌ను అధికారం నుండి దింపాలంటే బిజెపి పెద్ద ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూలై 17 లోగా స్పీకర్ నోటీసుపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ నోటీసులపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలో దాని ఫలితాన్ని బట్టి, భవిష్యత్ నంబర్ గేమ్ డిసైడ్ అవుతుంది. ఒకవేళ 19 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసే ప్రక్రియను కోర్టు నిలిపివేసి, అసెంబ్లీలో నేల పరీక్షలు నిర్వహించినట్లయితే, గెహ్లాట్‌కు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.