Rajasthan High Court: బిడ్డను కనేందుకు ఖైదీకి పెరోల్‌

Rajasthan High Court: భర్తతో బిడ్డను కనేందుకు పెరోల్‌ ఇవ్వాలంటూ.. కోర్టును ఆశ్రయించిన నందలాల్‌ భార్య

Update: 2022-04-11 14:00 GMT

Rajasthan High Court: బిడ్డను కనేందుకు ఖైదీకి పెరోల్‌

Rajasthan High Court: భార్యభర్తల బంధంపై ఇటీవల న్యాయస్థానాలు సంచలన తీర్పులు ఇస్తున్నాయి. కొన్ని తీర్పులు కొత్త వివాదాలకు కారణమవుతుంటే.. మరి కొన్ని చిత్రంగా ఉంటున్నాయి. పెళ్లి చేసుకున్నంత మాత్రన భార్యపై భర్తకు సర్వ హక్కులు ఉండవని.. ఆమెకు ఇష్టంలేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. అది లైంగి దాడేనని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతకుముందు భర్తకు భార్య భరణం చెల్లించాలంటూ యూపీలోని ముజఫర్‌నగర్‌ ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది. ఈ కోవలోనే రాజస్థాన్‌ హైకోర్టు ఆస్తికరమైన తీర్పును వెలువరించింది. భార్యతో కలిసి బిడ్డను కనేందుకు జీవిత ఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది.

రెండ్రోజుల క్రితం రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన నందలాల్‌ అనే వ్యక్తికి 2019లో ఓ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆరేళ్లుగా అజ్మీర్‌ సెంట్రల్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తనకు వివాహం అయినా పిల్లలు లేరని.. తన వైవాహిక జీవితంలో లైంగిక భావోద్వేగ అవసరాలు తీరడంతో పాటు తనకు బిడ్డను కనేందుకు తన భర్తకు 15 రోజులు పెరోల్‌ ఇవ్వాలని నందలాల్‌ భార్య హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఖైదీ నందలాల్‌, తన భార్యకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నది. భారతీయ సంస్కృతి, మతాచారాల ప్రకారం.. వంశ పరిరక్షణ అనేది కీలకమైనదని వ్యాఖ్యానించింది.

తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను న్యాయస్థానం ప్రస్తావించింది. అందులో ధర్మ, అర్థ, మోక్షంను ఒంటరిగా చేయవచ్చని.. కామాన్ని చేయలేరని వివరించింది. దోషి చేసిన తప్పుకు అమాయకమైన భార్యకు శిక్ష తగదని తెలిపింది. మాతృత్వంతోనే వివాహిత పరిపూర్ణమైన స్త్రీగా, తల్లిగా మారుతుందని.. అప్పుడే సమాజంలో ఆమె గౌరవం పొందుతుందని కోర్టు వివరించింది. ఈ కేసును తాము మతకోణంలో కూడా చూస్తున్నట్టు చెప్పింది. హిందూయిజం, జుడాయిజం, ఇస్లాం మత గ్రంథాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఖైదీ భార్య సంతానం పొందే హక్కును హరించడం అన్యాయమని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఖైదీకి 15 రోజుల పెరోల్‌ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది.

సాధారణంగా పలు కేసుల్లో దీర్ఘకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయడం న్యాయప్రక్రియలో సహజం. అత్యవసర పరిస్థితులు, కుటుంబ సభ్యులు మరణించడం లేదా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, లేదా దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం తదితర ప్రత్యేక పరిస్థితుల్లో పెరోల్ కమిటీలు, కోర్టులు ఖైదీలు పెట్టుకునే పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేస్తుంటాయి. ఈ పరిస్థితులకు భిన్నంగా బిడ్డను కనడానికి.. భార్యతో సంసారం చేసేందుకు వీలుగా 15 రోజుల పెరోల్‌ను తొలిసారి రాజస్థాన్ హైకోర్టు మాత్రమే మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సంతానం కోసం పెరోల్‌ మంజూరు చేయాలనే నిబంధన లేదని రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అంతకుముందు జిల్లా కమిటీ కూడా పెరోల్‌ను తిరస్కరించింది.

గతనెలలో వైవాహిక అత్యాచారంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. పెళ్లయిన నాటి నుంచి తనను భర్త ఓ సెక్స్‌ బానిసగా చూస్తున్నారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడంటూ కర్ణాటకకు చెందిన ఓ బాధితులు కోర్టును ఆశ్రయించింది. అత్యాచారం కింద కేసు పెట్టింది. అయితే ఐపీసీ సెక్షన్‌ 375 కింద కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టును అభ్యర్థించారు. ఈకేసును సింగిల్‌ బెంచ్‌ జడ్జి జస్టిస్‌ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం అత్యాచారం అభియోగాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. కూతురిని కూడా వేధిస్తున్నాడని బాధితురాలు తెలపడంతో.. సదరు భర్తపై బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం-పొక్సో కింద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు కొత్త సమస్యలకు తావిస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. భర్త నేరం చేసి జైలు కెళ్తే భార్య హక్కుల పరిరక్షణకు అతడిని అలా బయటకు వదిలేయాలా?.. ఇలా అయితే.. నేరస్థులు దీన్ని అడ్డుపెట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం సదరు భార్యకు మద్దతు పలుకుతున్నారు. ఏదేమైనా.. ఈ తీర్పు మాత్రం రెండ్రోజులుగా భారీగా ట్రెండ్‌ అవుతోంది.

Tags:    

Similar News