Rajasthan Political Crisis Updates:ఆరోజు వరకూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దు : రాజస్థాన్ హైకోర్టు
Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో స్పీకర్ అనర్హత నోటీసులను సవాలు చేస్తూ సచిన్ పైలట్ సహా 18 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ విచారణను జూలై 20 కి వాయిదా వేసింది రాజస్థాన్ హైకోర్టు. జూలై 21 సాయంత్రం 5.30 గంటల వరకు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో ఈ రోజు జరగాల్సి ఉన్న అసెంబ్లీ స్పీకర్ (సచిన్ పైలట్ మరియు ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుపై) విచారణ వాయిదా పడింది.
మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేము అని హైకోర్టులో స్పీకర్ సిపి జోషి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ప్రతీక్ కస్లివాల్ అన్నారు. కాగా 19 మంది రెబల్ ఎమ్మెల్యేకు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ పిటిషనర్ల తరఫు ప్రముఖ న్యాయవాదులు హరీష్‌సాల్వే, ముకుల్ రోహత్గి హైకోర్టును కోరారు. అసమ్మతి అంటే పార్టీ ఫిరాయించడంకాదని, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో నోటీసులు ఇవ్వడం సరైన చర్య కాదని వారు కోర్టులో వాదించారు.
మరోవైపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంలో రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సోషల్ మీడియాలో వైరలైన ఆడియో క్లిప్ నకిలీదని కేంద్ర మంత్రి షెకావత్ కొట్టిపారేశారు.