Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యం.. గర్భగుడిలోకి నీరు
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారడం వివాదాస్పదమైంది. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు తెలిపారు.
Ayodhya Ram Mandir: భారీ వర్షాలతో అయోధ్య రామమందిరం లీకేజీపై ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరిలో ప్రారంభించిన ఆలయ ప్రధాన భవనం లీకేజీ గురైనట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా అయోధ్య రామాలయంలో లీకేజీ జరిగిందని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పడంతో వివాదం చెలరేగుతోంది. ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి లీక్ గురించి వెల్లడించారు. నీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదని, భారీ వర్షాలు కురిస్తే చూడ్డానికి ఇబ్బందిగా మారుతుందని సత్యేంద్ర దాస్ అన్నారు.
ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ విషయంపై స్పందించారు. గురు మండపం బహిరంగ ప్రదేశంలో ఉండడమే దీనికి కారణమని నృపేంద్ర మిశ్రా తెలిపారు. నిర్మాణం పూర్తయితే సమస్య పరిష్కారమవుతుందన్నారు.మొదటి అంతస్తులో లీకేజీని గుర్తించామని, మొదటి అంతస్తు నిర్మాణంలో ఉందని మిశ్రా వివరించారు. నిర్మాణంలో కానీ, డిజైన్‌లో కానీ ఎలాంటి సమస్యలు లేవని నృపేంద్ర మిశ్రా వివరించారు.
ఇక ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పించింది. అయోధ్యను బీజేపీ అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీపీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ ఆరోపించారు. ప్రధాన పూజారి వెల్లడించిన విషయాలు దీనికి నిదర్శనమని అజయ్ రాయ్ అన్నారు. వాస్తవానికి అయోధ్యలో రోడ్లు రోజురోజుకూ నాసిరకం అవుతున్నాయని, బీజేపీ నాసిరకం అభివృద్ధి పనులు చేస్తోందని అజయ్‌రాయ్ ఆరోపించారు. గతంలో వర్షం కారణంగా అయోధ్య రైల్వే స్టేషన్ చుట్టూ గోడ కూలిపోయిందన్నారు.