Rahul Gandhi: ఇవాళ రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ బృందం
Rahul Gandhi: లఖింపూర్ ఖేరి ఘటనపై ఫిర్యాదు చేయనున్న రాహుల్ టీమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్నారు. లఖింపుర్ ఘటనపై వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రా ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. గత శనివారం ఆయనను 12 గంటల పాటు విచారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అయితే విచారణలో ఆశిష్ సరిగా సహకరించడం లేదని, మరికొన్ని రోజులు రిమాండ్‌కు అప్పగించాలని పోలీసులు కోరారు. వీరి అభ్యర్థన మేరకు కోర్టు. ఆశిష్‌ను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.