ముహూర్తానికి ముందే సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా చేయనున్న సోనియా, రాహుల్, ప్రియాంక ?
Congress: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం అవుతోంది.
Congress: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం అవుతోంది. వాస్తవానికి ఆ సమావేశం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే సెప్టెంబర్ లో జరగాల్సి ఉంది. ఆ సమావేశాల్లోనే పార్టీ నాయకత్వ మార్పిడిపై చర్చించాలనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో పార్టీ దారుణ పరాభవాన్ని మూట గట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లోనే గాక పార్టీలో సైతం తీవ్ర దుమారం రేపుతోంది. యూపీలో 7 సీట్లుంటే ఐదింటిని కోల్పోయి రెండింటికే కుచించుకుపోయింది. రాహుల్ పర్ఫామెన్స్ బాలేదన్న కారణం చేత ప్రియాంకను రంగంలోకి దింపి భారీ ప్రచారం చేసినా పర్ఫామెన్స్ చూపించలేకపోయారు. అలాగే ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ స్టేట్స్ లో పవర్ ఖాయమేనని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పాయి. కానీ వచ్చిన ఫలితాలు మాత్రం మరోలా ఉన్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ ను నడిపించే దీటైన నాయకత్వం ఇక ఎప్పటికీ రాదేమో అన్న నైరాశ్యం అన్ని స్థాయిల్లోనూ అలముకొంది. దీంతో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సోనియా, రాహుల్, ప్రియాంక సామూహికంగా రాజీనామాలు చేస్తారన్న పుకార్లు కూడా వినిపించాయి. వాటిని కాంగ్రెస్ హైకమాండ్ ఖండించింది. అయితే గాంధీ ఫ్యామిలీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉండడం సాధ్యం కాదని, వారు లేకపోతే దీన్ని ఐక్యంగా కలిపి ఉంచడం సాధ్యం కాదని ఇన్ సైడర్స్ అంటున్నారు. మరి ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.