Rahul Gandhi: అవి మా యాత్రను ఆపలేవు
Rahul Gandhi: 100 కి.మీ పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు (Bharat Jodo Yatra) భారీ స్పందన లభిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, కనీసం గొడుగు లేకుండానే రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్రలో పాల్గొన్నవారి కాళ్లను బొబ్బలు వేధిస్తున్నప్పటికీ అవి మా యాత్రను ఆపలేవన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కేరళలో మూడో రోజు కొనసాగుతోన్న యాత్రలో పాల్గొన్న వారిలో కొందరి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాహుల్.. తన బృందంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
కేరళలో కొనసాగుతోన్న రాహుల్ యాత్ర మంగళవారం ఉదయం 7.15 గంటలకు కనియాపురంలో ప్రారంభమైంది. అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే రాహుల్ బృందానికి స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి పాదయాత్రలో పాల్గొనడం కనిపించింది. దీంతో వారిని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్.. విద్వేషం, హింసతో ఎన్నికల్లో గెలవవచ్చేమో కానీ, వాటివల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కారం కావని అన్నారు. సోమవారం సాయంత్రానికి వంద కి.మీ దూరం పూర్తిచేసుకున్న భారత్ జోడో యాత్రలో.. అన్ని వర్గాల ప్రజలను పలుకరిస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగడం కనిపించింది.
ఇదిలాఉంటే, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. సెప్టెంబర్ 10 సాయంత్రం కేరళకు చేరుకుంది. రాష్ట్రంలో 19రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఏడు జిల్లాల్లో సుమారు 450 కి.మీ మేర సాగే రాహుల్ పాదయాత్ర.. అక్టోబర్ 1న కర్ణాటకలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొత్తంగా 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3500కి.మీ మేర కొనసాగనున్న విషయం తెలిసిందే.