Bharat Jodo Yatra: నేటి నుంచి రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర

Update: 2022-09-07 02:06 GMT

Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

Bharat Jodo Yatra: 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి సవాలు విసిరేందుకు ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'భారత్ జోడో' యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఇవాళ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3వేల 750 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర 150 రోజుల పాటు జరుగుతుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత స్టాలిన్ కన్యాకుమారిలో రాహుల్‌గాంధీకి ఖాదీ త్రివర్ణ పతాకాన్ని అందించడంతో యాత్ర మొదలవుతుంది. గాంధీ మండపం నుంచి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు పాదయాత్రగా సాగి బహిరంగ సభ జరిగే వేదిక వద్దకు చేరుకుంటారు. దీనికి ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ స్మారక స్థలి వద్ద జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ విగ్రహం, కామరాజ్ మెమోరియల్‌ను కూడా రాహుల్ సందర్శిస్తారు.

అయితే రాహుల్ గాంధీతో చివరి వరకు నడవడానికి 117 మంది నేతలను సెలెక్ట్ చేసింది భారత్ జోడో కమిటీ. తెలంగాణ నుండి బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, కేతురి వెంకటేష్, సంతోష్, వెంకట్ రెడ్డి, అనులేఖకు ఈ యాత్రలో చోటు దక్కింది. యాత్రలో పాల్గొనే నేతలకు కావాల్సిన వస్తువులు అన్ని 20 ట్రక్కుల ద్వారా తరలించనున్నారు. ఈ ట్రక్కులు రాహుల్ యాత్రతోనే సాగనున్నాయి.

ఇక తెలంగాణలో అక్టోబర్ 24న రాహుల్ యాత్ర ఎంటర్ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక మీదగా తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గంలో రాహుల్ యాత్ర ప్రవేశించి.. దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపేట, మద్నూల్ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతుంది. తెలంగాణలో మొత్తం 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ.

ప్రతి రోజు రాహుల్ గాంధీ 25 కిలోమీటర్లు నడవనున్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలతో ఆయన మాట్లాడతారు. అయితే బహిరంగ సభలు మాత్రం ప్రతి స్టేట్‌లో స్టాటింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ వద్ద రెండు పెద్ద సభలు పెట్టె అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కనీసం 3 భారీ బహిరంగ సభలు పెట్టాలని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా పాదయాత్ర జరిగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలని భావిస్తున్నారు. ఇక రాహుల్ భారత్ జోడో యాత్రకు తెలంగాణ నుంచి ఇంఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఉన్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ఈ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News