Rafale in India LIVE updates: ఫ్రాన్స్ నుంచి వచ్చిన ప్రతిష్ఠాత్మకమైన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ రోజు హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగాయి. అబుదాబి అల్ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఐదు రఫేల్ విమానాలు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ రూ.59 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తొలివిడతలో ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి. భారత్ కు వచ్చిన యుద్దవిమానాల తొలిబ్యాచ్ ఇక్కడ జరిగే ఓ అధికారిక కార్యక్రమం తరువాత భారత వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. మధ్యాహ్నం 3:31 సమయంలో విమానాలు భారత భూభాగంలోకి దిగగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ ఇచ్చారు. ఇక ఈ రఫేల్ యుద్ద విమానాలు 17వ వైమానిక స్క్వాడ్రన్‌లో చేరనున్నాయి. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది.
ఇక సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రాఫెల్ యుద్ద విమానాలు సుమారుగా ఏడు గంటల ప్రయాణం చేసి ముందుగా యూఏఈలోని ఓ ఫ్రాన్స్ వైమానిక స్థావరంలో దిగాయి. ఈ యుద్ద విమానంలో ఇంధనం అయిపోవడంతో 30 వేల అడుగుల ఎత్తులో ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి నిన్న రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకుంటున్నాయి. కాగా ఈ ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన రఫేల్ విమానం దక్షిణ ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన విమానం కావడం విశేషం.