ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది. దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్ తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్ వెహికల్ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా తీరనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా.