TOP 6 News @ 6PM: దేవేంద్ర ఫడ్నవీస్ అను నేను... చివరి వరకు సస్పెన్స్ పెట్టిన ఎక్‌నాథ్ షిండే
1) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
Devendra Fadnavis takes oath as Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ వేడుకకు హాజరై కొత్త సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
వీరే కాకుండా వ్యాపార వర్గాల నుండి ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సచిన్ టెండుల్కర్, షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన వారి జాబితాలో ఉన్నారు.
2) చివరి వరకు సస్పెన్స్ పెట్టిన ఎక్‌నాథ్ షిండే
Eknath Shinde takes oath as Deputy CM: మహాయుతి కూటమి నేతల్లో కీలక నేత అయిన ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున కూడా చివరి వరకు సస్పెన్స్ పెట్టారు. అదేంటంటే.. షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత కొరవడింది. ఆయన పదవుల పంపకాల విషయంలో కొంత అసంతృప్తితో ఉండటమే అందుకు కారణంగా వార్తలొచ్చాయి. ముందుగా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే గట్టిగా ప్రయత్నించారని, అందుకే సీఎం ఎవరనే ప్రకటన ఆలస్యమైందని ప్రచారం జరిగింది. దాంతో బీజేపి ప్రకటించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా వారికి తన మద్దతు ఉంటుందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. కానీ ఆ తరువాత కూడా షిండే వ్యవహరించిన తీరు ఆయన ఇంకా అసంతృప్తితోనే ఉన్నారనే వాదనలకు బలం చేకూర్చాయి.
చివరకు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే విషయంలోనూ షిండే అలకబూనినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రమాణస్వీకారానికి కొద్దిసేపు ముందుగా షిండే వర్గానికి చెందిన ఉదయ్ సామంత్ చేసిన ప్రకటన ఆ సస్పెన్స్ కు తెరదించింది. ఏక్ నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అంగీకరించారని, ఆ లేఖను కూడా గవర్నర్ కు అందజేశానని రాజ్ భవన్ వద్ద ఉదయ్ సామంత్ మీడియాకు తెలిపారు. దాంతో అప్పటివరకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది.
3) నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్ వీ - సీ 59 రాకెట్
ISRO: పీఎస్ఎల్ వీ - సీ 59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం ఈ రాకెట్ నింగిలోకి వెళ్లింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్ వీ- సీ 59 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం నాడు సాంకేతిక సమస్యతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు.
సూర్య కిరణాలను ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. సూర్యుడి బాహ్య వాతావరణమై కరోనాపై పరిశోధనలు చేయనున్న ప్రోబా-3 శాటిలైట్లు.కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3 శాటిలైట్లను రూపొందించారు.కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ప్రోబా-3 ప్రత్యేకత. ప్రోబా-3 లో రెండు ఉపగ్రహాలుంటాయి.
4) కాకినాడ పోర్ట్ స్టెల్లా షిప్‌లో తనిఖీలపై మంత్రి నాదెండ్ల ప్రకటన
కాకినాడ పోర్టులో లంగరేసిన స్టెల్లా షిప్‌లో తనిఖీలు జరుగుతున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇప్పటివరకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు కోటి 20 లక్షల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా అయినట్లు గుర్తించినట్లు చెప్పారు. అందులో విశాఖ పోర్ట్, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడప పోర్టు ద్వారానే ఎక్కువ మొత్తంలో బియ్యం విదేశాలకు తరలిపోయినట్లు తేలిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌరసరఫరాల శాఖ పని తీరుపై జరిగిన సమీక్షలో పాల్గొని మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల ఈ వివరాలు వెల్లడించారు.
5) ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, అదే సమయంలో ఆయన ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని హై కోర్టు సూచించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 3న ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలోనే హై కోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
6) Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్
Pushpa 2: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ప్రకటించింది. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమైందిగా చెప్పారు. త్వరలోనే తమ బృందం బాధిత కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందించనుందని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కాంగ్రెస్ బహిష్కృత నాయకులు బక్క జడ్సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తొక్కిసలాటలో మహిళ మృతికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాత బాధ్యత వహించాలని ఆయన ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. బాధితురాలి కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.