Purvanchal Expressway: యూపీలో ఇవాళ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
* రూ. 22,500 కోట్లతో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం * పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Purvanchal Expressway: ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. భారత వాయుసేనకు చెందిన సీ-130జే సూపర్ హెర్క్యూలస్ విమానంలో ఈ రహదారిపై దిగి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా నిర్వహించే వైమానిక విన్యాసాలకు, ల్యాండింగ్ కసరత్తుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇందులో భాగంగా ఏఎన్- 32 విమానం, ఫైటర్ జెట్‌లు సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000లు ఆదివారం ఈ మార్గంపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చే సీ-130జే కూడా సుల్తాన్‌పూర్ జిల్లాలో సిమెంట్‌తో వేసిన ఎయిర్ స్ట్రిప్‌లో దిగింది. 3వందల 40 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో కొన్ని సెక్షన్లను అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలుగా తీర్చిదిద్దారు.
ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ సుల్తాన్‌పుర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద దిగుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్లనున్నారు. తిరిగొచ్చి. మిరాజ్-2000, ఏఎన్-32 విమానాల ల్యాండింగ్‌ను వీక్షిస్తారు. ఏఎన్-32లో బలగాలు కూడా దిగనున్నాయి.
యూపీ రాజధాని లక్నో నుంచి బారాబంకి, అమేఠీ, సుల్తాన్‌పూర్, అయోధ్య, ఆజంగఢ్, గాజీపూర్ తదితర జిల్లాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేసుకుంది పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే. సుల్తాన్‌పూర్ దగ్గర రహదారిపైనే 3.2 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం చేశారు. 22వేల 500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు.