Covid Vaccine: మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్.. వారికి మాత్రం అనుమానమే!
Covid Vaccine: దేశవ్యాప్తంగా మే ఒకటిన ప్రారంభంకానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బందులు తప్పేట్లులేవు.
Covid Vaccine: దేశవ్యాప్తంగా మే ఒకటిన ప్రారంభంకానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బందులు తప్పేట్లులేవు. 18 ఏళ్లు వయసు నిండిన వారందరికీ కోవిడ్ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ సరిపడా టీకా డోస్‌లు లేకపోవడంతో అందరికీ టీకాలు వేయలేమని పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. టీకా డోస్‌లకు తీవ్రమైన కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమని రాష్ట్రాలు స్పష్టంచేస్తున్నాయి.
ఢిల్లీ, పంజాబ్ , గుజరాత్‌లో టీకాలు తక్కువ మొత్తంలో ఉండటంతో 18 ఏళ్లు నిండిన వారి కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలయ్యే అవకాశం కనిపించడంలేదు. 'ఫార్మా సంస్థల నుంచి టీకాలు అందగానే వ్యాక్సినేషన్ మొదలుపెడతాం అని గుజరాత్ ప్రకటించింది. టీకాలు పంపాలని వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
యూపీ లో ఉచితంగా అందరికీ టీకా నిమిత్తం దాదాపు 5 కోట్ల డోస్‌లను కొనుగోలుచేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లకు చెరో 50 లక్షల డోస్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా టీకాల కోసం తయారీసంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చింది. వేర్వేరు తయారీసంస్థల నుంచి ఒక కోటి 34 లక్షల టీకాలు కొనుగోలు చేసేందుకు కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో 18 ఏళ్లు పైబడినవారికి టీకా ఇవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది.