Free smartphones For Students: ఆ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
Free smartphones For Students: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు.
Free smartphones For Students: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.
ఆగస్టు 12న అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పాఠాలు నిర్వహిస్తున్నందున, పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో విద్యార్థులకు పోన్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని సీఎం అన్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. అయితే మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించారు. గతంలోనే రాష్ట్ర యువతకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో సీఎం అమరీందర్ సింగ్ పథకాన్ని ప్రారంభించనున్నారు.