నిరాడంబరంగా పంజాబ్‌ సీఎం పెళ్లి

Bhagwant Mann: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మన్‌ డాక్టర్‌ గురుప్రీత్ కౌర్‌ను పరిణయమాడారు.

Update: 2022-07-07 12:15 GMT

నిరాడంబరంగా పంజాబ్‌ సీఎం పెళ్లి

Bhagwant Mann: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మన్‌ డాక్టర్‌ గురుప్రీత్ కౌర్‌ను పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో వివాహ వేడుక జరిగింది. బంగారు వర్ణం దుస్తుల్లో, పసుబు రంగు తలపాగాను ధరించి పెళ్లి దుస్తుల్లో భగవంత్‌ మెరిసిపోయారు. సిక్కు సంప్రదాయం ప్రకారం భగవంత్‌ మన్‌ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరితో పాటు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పార్టీ ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సీఎం భగవంత్‌కు కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌, డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ వివాహం చండీగడ్‌లోని గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. మొదటి భార్య ఇంద్రప్రీత్‌ కౌర్‌తో ఆరేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న ఆయన తాజాగా గురుప్రీత్‌ కౌర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలన్న తల్లి కోరికను భగవంత్‌ మన్‌ తీర్చారు. ఆనంతరం తల్లి హర్పల్‌ కౌర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుమారుడు మళ్లీ వివాహం చేసుకోవడంతో తల్లి హర్పల్‌ కౌర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. వారిలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ నేత రాఘవ చద్దా వంటి కీలక నేతలు ఉన్నారు. పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం భారతీయ ఇటాలియన్‌ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్‌ తందూరీ కుల్చే, దాల్‌ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీతో సహా రకరకాల వంటలు తయారు చేయించారు.

భగవంత్‌ మన్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భగవంత్‌ చేసుకోబోతున్న డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ ఎవరనే చర్చ జోరుగా సాగింది. హర్యానాలోని కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందిన రైతు ఇంద్రజిత్‌ సింగ్‌, రాజక్‌ కౌర్‌ దంపతుల కూతురే గుర్‌ప్రీత్‌. అమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ముల్లానా వైద్య కళాశాలలో 2018లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన గుర్‌ప్రీత్‌ కౌర్‌ గోల్డ్‌మెడల్‌ కూడా సాధించారు. ప్రస్తుతం గుర్‌ప్రీత్‌ కౌర్‌ ఫిజిషియన్‌గా పని చేస్తున్నారు. కొన్నేళ్లుగా మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ కుటుంబాలు సన్నిహితంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భగవంత్‌ మన్‌కు ఎంతగానో సహాయం అందించినట్టు తెలుస్తోంది. తల్లి హర్పాల్‌ కౌర్ సూచన మేరకే గుర్‌ప్రీత్‌తో వివాహానికి మన్‌ ఒప్పుకున్నట్టు సమాచారం.

1973 అక్టోబరు 17న పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలో జన్మించారు భగవంత్‌ మాన్‌ చిన్నతనం నుంచే ఎంతో హాస్య చతురత ప్రదర్శించే మన్‌.. కాలేజీ రోజుల్లోనే కామెడీ చేసేవారు. ఆ తరువాత కామెడీనే ఆయన తన వృత్తిగా ఎంచుకున్నారు. రాజకీయాలు, వ్యాపారాలు, క్రీడలు వంటి అంశాలపై తనదైన శైలిలో కామెడీతో రెచ్చిపోయేవారు. తక్కువ సమయంలోనే భారీగా అభిమానులను భగవంత్‌ మన్‌ సంపాదించుకున్నారు. 2011లో భగవంత్‌ మన్‌ చేసిన జుగ్ను కెహెందా హై.. జుగ్ను మస్త్.. మస్త్‌ వంటి కామెడీ షోలతో బాగా పాపులర్‌ అయ్యారు. కమెడియన్‌గా గుర్తింపు పొందిన భగవంత్ 2011 తరువాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీలోపార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. 2017లో ఆప్‌ పంజాబ్‌ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్‌ స్వీప్ చేయడంతో భగవంత్‌ సీఎం పగ్గాలను చేపట్టారు.

భగవంత్‌ మన్‌ మొదటి భార్య ఇంద్రప్రీత్‌ కౌర్‌తో 2015లోనే విడాకులు తీసుకున్నారు. 48 ఏళ్ల భగవంత్‌ మన్‌కు సీరత్‌ అనే 21 ఏళ్ల కూతురు, దిల్షన్‌ అనే 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. 

Tags:    

Similar News