పీఎస్ఎల్వీ సీ 51 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్)ను ఆదివారం ఉదయం 10.24కు నింగిలోకి విజయవంతంగా పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ51ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభంకాగా, ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.