Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక
Wrestlers Protest: ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన రెజ్లర్లు
Wrestlers Protest: జంతర్ మంతర్ దగ్గర నెలరోజులుగా ధర్నాలు చేస్తున్న భారత రెజ్లర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమంటూ తమ ఆవేదనను ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు రెజ్లర్లు. ఇవాళ ఇండియా గేట్ దగ్గర నిరవధిక నిరహారదీక్షకు దిగుతామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు రెజ్లర్లు. రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు... ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యవస్థ తమకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హరిద్వార్ వెళ్లి సాయంత్రం 6 గంటలకు గంగా నదిలో పతకాలను విసిరేస్తామని ప్రకటించారు.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంలో శాంతియుతంగా చేస్తున్న తమ నిరసనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెజ్లర్లు. ప్రభుత్వం తమను క్రిమినల్స్‌లా చూస్తోందన్నారు. తాము న్యాయం కోసం పోరాడుతూ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని బ్రిజ్ భూషణ్‌ను ఆహ్వానించడం.. బ్రిజ్ భూషణ్ అక్కడ తెలుపు దుస్తుల్లో పోజులివ్వడం తమను కలచివేసిందన్నారు. మహిళ అయిన రాష్ట్రపతికి కానీ.. ప్రధానికి కానీ తమ గోడు పట్టడం లేదన్నారు. పతకాలే తమ ప్రాణం.. తమ జీవితం అన్న అగ్రస్థాయి రెజ్లర్లు.. వాటిని నదిలో నిమజ్జనం చేస్తే తమ జీవితాలకు అర్థం ఉండదన్నారు. అందుకే తమ ప్రాణాలు పోయినా న్యాయం కోసం పోరాడతామని.. అందుకే నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నామని తెలిపారు.