Narendra Modi: అభివృద్ధిలో జమ్ముకశ్మీర్ నూతన అధ్యాయం
Narendra Modi: జమ్ముకశ్మీర్‌లో రూ.20వేల కోట్ల విలువైన.. పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు
Narendra Modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పూర్తి స్థాయి పర్యటన చేపట్టారు ప్రధాని మోడీ. ఆదివారం పల్లీలో బహిరంగ సభతోపాటు పలు చోట్ల మొత్తం 20 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని రిమోట్ కంట్రోలర్ ద్వారా ప్రారంభించారు. కశ్మీర్ లోయలో యువత తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ కొత్త చరిత్రను లిఖించబోతోందని హామీ ఇచ్చారు. తాతలు, తండ్రులు పడినన్ని ఇబ్బందులు లేకుండా ఇప్పటి తరానికి మంచి భవిష్యత్తు అందేలా చూస్తామని మాటిచ్చారు. చరిత్ర పొడవునా జమ్మూ కాశ్మీర్‌కు 17 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, గత రెండేళ్లలోనే 38 వేల కోట్లకు ఎగబాకిందని వివరించారు.
పంచాయతీరాజ్‌లో మహిళా సాధికారత కోసం తాము గట్టి కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. నీటి సంరక్షణ పట్ల మహిళలకు శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని పంచాయతీలను కోరారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. వ్యర్థాల నిర్వహణకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలని పంచాయతీలు, గ్రామ ప్రజలను కోరారు. ఇక భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్ చరిత్రలో అభివృద్ధి పనుల ద్వారా ఓ నూతన శకం ప్రారంభమైనట్లేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో, అభివృద్ధిలో గానీ జమ్మూ కాశ్మీర్ దేశానికి ఒక కొత్త మార్గదర్శిగా నిలిచిందన్నారు.
యువత తన మాటలపై విశ్వాసం ఉంచాలని మోడీ కోరారు. తాజాగా చేపట్టిన కార్యక్రమాలు లోయలో యువతకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. గత రెండుమూడేళ్లుగా జమ్మూ, కశ్మీర్‌లో కొత్త అభివృద్ధి చోటు చేసుకుంటోందని మోదీ చెప్పారు. దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్ దివస్ లాంటి కార్యక్రమాలను కశ్మీర్ ప్రజలు జరుపుకోగలుగుతున్నారని చెప్పారు.