Atal Tunnel Rogtang : ప్రపంచలోనే అతి పొడవైన అటల్‌ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ

Update: 2020-10-03 07:42 GMT

Atal Tunnel Rogtang : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని (అటల్‌ టన్నెల్‌) హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న సొరంగ మార్గాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తరువాత కాసేపు ఆ సొరంగ మార్గంలో సరదాగా నడిచుకుంటూ తిరిగారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నారు.

ఇక ఈ సొరంగ మార్గాన్ని 9.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-స్పిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద నిర్మించారు. గతంలో ఈ మార్గాన్ని రోహ్‌తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. కానీ 2019 డిసెంబరు 24 తేదీన అటల్‌ టన్నెల్‌గా పేరు మార్చారు. దేశ ప్రధాని పదవిలో అటల్ బిహార్ వాజ్‌పేయీ ఉన్న సమయంలో అంటే 2000 జూన్‌ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సొరంగ మార్గాన్ని అధికారులు ఆరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వాతావరణ పరిస్థతులు మరి కొన్ని కారణాలతో నిర్మాణం కాస్త ఆలస్యం అయింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో శనివారం ప్రధాని నరేంద్రమోడి దాన్ని ప్రారంభించారు. ఇక ఈ నిర్మాణంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది.

ఇక ఈ సొరంగ మార్గం విశేషాల్లోకెళితే ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ సొరంగ మార్గ నిర్మాణికి సుమారుగా రూ.3,300 కోట్లు ఖర్చు అయింది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో ఇదే అత్యంత పొడవైంది. ఈ సొరంగ మార్గంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్‌, 60 మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థ, 500 మీటర్లకు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా, 2.2 కి.మీ.లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ.కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి. అంతే కాదు సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సైనిక వాహనాల్లో సామగ్రిని త్వరితగతిన తరలించ డానికి వీలుగా ఉంటుంది. ఈ సొరంగంతో మనాలి - లేహ్‌ల మధ్య 46 కి.మీ. దూరం తగ్గనుంది. ఈ సొరంగ మార్గం హిమాచల్‌ ప్రజలకూ ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా అక్కడ ఆరు నెలల పాటు దట్టంగా కురిసే మంచు వల్ల స్థానికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

Tags:    

Similar News