PM Modi: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: సెంగోల్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన మోడీ
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అంగరంగ వైభోంగా సాగింది. ఉదయం 7 గంటల20నిమిషాలకు కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధానికి వేదపడింతులు స్వాగతం పలికారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీకి పూజారులు సెంగోల్ ఇచ్చారు. అనంతరం ఆ సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ను ప్రతిష్టించారు. ప్రత్యేక పూజతో వేడుక ప్రారంభమైంది. సుమారు గంటపాటు ఈ పూజా కార్యక్రమాలు సాగాయి.
కొత్త పార్లమెంటులో సెంగోల్ ను ఏర్పాటు చేసిన తరువాత, ప్రధాని మోడీ ఈ భవనాన్ని నిర్మించిన కార్మికులను కలుసుకున్నారు. వారిని సన్మానించారు. పలువురు కార్మికులకు ప్రధాని మోడీ జ్ఞాపికలు అందజేశారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జాతీయ గీతం ఆలపించడంతో మరో కార్యక్రమం ఉండనుంది. పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శించానున్నారు.
రెండో విడత ప్రారంభ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలా 30 నిమిషాలకు లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిథులు అందరూ హాజరవుతారు. అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగాలు ఉంటాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన ప్రత్యేక వీడియోలను ప్రదర్శించనున్నారు.