INS Vikrant: విక్రాంత్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ

INS Vikrant: హిందూ మహాసముద్రంలోకి బాహుబలి నౌక

Update: 2022-09-03 08:27 GMT

INS Vikrant: విక్రాంత్‌ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ

INS Vikrant: ఇన్నాళ్లు హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం వహిస్తున్న డ్రాగన్‌ కంట్రీకి చెక్‌ పడింది. చట్టూ ఉన్న దేశాలను మచ్చిక చేసుకుని.. భారత్‌ను చైనా భయపెట్టాలనుకుంటోంది. బీజింగ్‌ ఆట కట్టించేందుకు బాహుబలి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను భారత్‌ రంగంలోకి దింపింది. ఇక నుంచి హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఆటలను భారత్‌ నేవీ పూర్తిస్థాయి అడ్డుకోనున్నది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ నౌకను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహన నౌకను జాతికి అంకితమిచ్చారు. కేరళ తీరంలో నవ శకాన్ని భారత్‌ ప్రారంభించిందని తెలిపారు. అమృత్‌ మహోత్సవ్‌ వేళ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. విక్రాంత్‌ నౌకను చూసి.. ప్రతి భారతీయుడు గర్వించాలని ప్రధాని మోడీ అన్నారు.

76 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌక.. 2023లో పూర్తిగా అందుబాటులోకి రానున్నది. దీని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్‌ మిషనరీ ఆపరేషన్లు, షిప్‌ నేవిగేషన్‌, ఆటోమేటిక్‌ సర్వైబిలిటీ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా.. 2వే 500-గ్యాస్‌ టర్బైన్లు 4, 60 క్రిటికల్‌ పంప్స్‌, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, అగ్నిమాపక వ్యవస్థలు, ఉంటాయి. అంతేకాదు.. టేకాఫ్‌ సమయంలో ఎయిర్‌క్రాప్ట్‌కు అదనపు లిప్ట్‌ ఇచ్చే ఫ్లైట్‌ డెస్‌ స్కీ జంప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఎయిర్‌క్రాప్ట్‌ టేకాఫ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నౌకలో ఏ భాగం మొరాయించినా.. ఇతర భాగాలపై మాత్రం ప్రభావం చూపదు.. దీంతో ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఆంటకాలు ఏర్పడవు.. అంతేకాదు.. ఈ నౌకపై క్షిపణితో దాడిచేసినా చెక్కు చెదరదు. అలాంటి వ్యవస్థతో ఈ నౌకను నిర్మించడానికి 20వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది.

కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్‌ విమాన వాహక నౌక నిర్మాణం ప్రారంభమైంది. నేవీ అంతర్గత సంస్థ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నిర్మాణం ప్రారంభమైంది. 2009 నుంచి నిర్మాణ పనులు వేగవంతమై.. పూర్తి కావడానికి 13 ఏళ్లు పట్టింది. దేశీయ సంస్థలు బీఈఎల్‌, భెల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, జిందాల్‌ సహా మొత్తం 500 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్‌ఈఎంలు ఈ నౌక నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఇక నౌక తయారీకి 23వేల టన్నుల ఉక్కు, 2వేల 500 కి.మీ.పొడవైన ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌, 150 కిలోమీటర్ల పైపులు, 2వేల వాల్వులు, ఇతరాత్ర పరికరాలు స్వదేశీయంగా తయారుచేసినవే.. కేవలం కొన్ని భాగాలను మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. 42వేల 800వేల టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌లతో దీన్ని నిర్మించారు.

ఈ నౌకకు బంగ్లాదేశ్‌ యుద్ధంలో సమర్థవంతంగా పని చేసిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరునే పెట్టారు. ఈ యుద్ధ విమాన వాహక నౌక 34 యుద్ధ విమానాలను మోసుకుపోగలదు. దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, మొత్తం 14 అంతస్తులతో నిర్మించారు. ఇందులో మొత్తం 2వేల 300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వాటిలో మహిళల కోసం ప్రత్యేక క్యాబిన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 17 వందల 50 మంది ఈ నౌకలో విధులు నిర్వహించనున్నారు. ఇవేకాకుండా... ఈ నౌకలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆత్మనిర్బర్‌ భారత్‌కు ఊతమిస్తూ.. నిర్మించిన ఈ బాహుబలి నౌకను ప్రధాని మోడీ నావికాదళానికి అప్పగించారు. ఇప్పటిదాకా కేవలం అమెరికా, రష్యా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ దేశాలకు మాత్రమే భారీ విమాన వాహక నౌకలను నిర్మించే సామర్థ్యమున్నది. ఇప్పుడు భారత్‌ కూడా ఆ దేశాల సరసన నిలవనున్నది. 

Tags:    

Similar News