Presidential Poll: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్
Presidential Poll: ముర్ము వెంట రానున్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా
Presidential Poll: NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్‌షాతో కలిసి వెళ్లి ముర్ము రాష్ట్రపతి పదవి పోటీకి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ద్రౌపది ముర్మ నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలిపే పార్టీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఒడిషా అధికార పార్టీ BJD తరఫున ఇద్దరు సీనియర్లు, వైసీపీ తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరుకానున్నారు.
ముర్ము నామినేషన్ పత్రంలో.. ప్రధాని మోడీ, నడ్డాతో సహా పలువురు అగ్ర నేతలు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన 50 మంది ప్రతిపాదిస్తే.. మరో 50 మంది బలపరచాల్సి ఉంటుంది.
నామినేషన్ ప్రక్రియ ముగియగానే ముర్ము తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆమె దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ రాజకీయ పార్టీల నేతలను కలవనున్నారు. తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించనున్నారు. గణాంకాల పరంగా చూస్తే ముర్ము విజయావకాశాలు బలంగా ఉన్నాయి. ఆమె గెలిస్తే దేశానికి రాష్ట్రపతి అయిన తొలి గిరిజన మహిళగా నిలిచిపోనున్నారు. దీంతోపాటు రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్రలో నిలుస్తారు.
ఇక రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న, కౌంటింగ్ 21న జరుగనుంది.