Puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం
Puducherry: బలనిరూపణ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది
Puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయి. బలనిరూపణ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత సీఎం నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు ఎటువంటి ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సిఫారసు లేఖను ఢిల్లీకి పంపారు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రోజున నారాయణస్వామి ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయారు. 26 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించలేకపోయింది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయిదుగురు కాంగ్రెస్, ఒకరు డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విపక్షాలతో జతకూడి తమ ప్రభుత్వాన్ని కూల్చినట్లు నారాయణస్వామి ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.