President Ramnath Kovind Independence Day Speech: కరోనా వారియ‌ర్స్‌, అమరజవాన్లను దేశం ఎన్న‌టికీ మరువదు: రాష్ట్రపతి

President Ramnath Kovind Independence Day Speech: కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ త‌రుణంలో క‌రోనా వారియ‌ర్స్ తీరును ‌ భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్ధఖ్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరజవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు.

Update: 2020-08-14 17:00 GMT

President Ramnath Kovind Independence Day Speech: కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ త‌రుణంలో క‌రోనా వారియ‌ర్స్ తీరును ‌ భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్ధఖ్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరజవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని... శుక్ర‌వారం సాయంత్రం జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. యావ‌త్ భార‌తావ‌ని గ‌ల్వాన్ లోయ‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జ‌వాన్ల త్యాగాల‌ను ఈ దేశం ఎన్న‌డూ మ‌రువ‌దని, వారికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. జూన్‌లో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం చెందడం తెలిసిందే.

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచం కరోనా వైరస్‌పై పోరాటం చేస్తుంద‌ని, ఈ పోరాటంలో ముందు వరుసలో ఉన్న 'ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్' సేవలను కీర్తించారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య్ద కార్మికుల సేవలను రాష్ట్రపతి కొనియాడారు. వీరి సేవలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశం చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు.

కరోనా విజృంభణతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని, ఈ వైరస్‌ పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న యోధులకు దేశం రుణపడి ఉందన్నారు. వందేభారత్‌ కార్యక్రమం ద్వారా 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు.

2020లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కరోనా వేళ ఇంటి నుంచి పని, ఈ-లెర్నింగ్‌ బాగా పెరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో తీసుకున్న చర్యలతో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టాన్ని నివారించడంలో కేంద్రం విజయవంతం సాధించింద‌ని అన్నారు. అలాగే కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలను అనుస‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందించిన తీరును అభినందించారు.

మహాత్మా గాంధీ మన స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శి కావడం మన అదృష్టం. ఒక సాధువు, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకీయ నాయకుడి మధ్య సమన్వయం భారతదేశంలో మాత్రమే సాధ్యమైందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

కొవిడ్ 19 నియంత్ర‌ణ‌లో దేశ ప్రజల సహకారం అమోఘమనీ, కరోనా కారణంగా ఈ ఏడాది మునుపటిలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మునుపటిలా జరుపుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పలు రంగాల్లో దేశం స్వయం సంవృద్ధి సాధించేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి అభినందించారు.

ఇక రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారని అన్నారు. మందిర నిర్మాణం కూడా ప్రారంభమైందని గుర్తు చేశారు.అలాగే మోడీ స‌ర్కార్ నూత‌న ప్ర‌వేశ‌పెట్టిన జాతీయ విద్యా విధానం పట్ల రాష్ట్రపతి కోవింద్ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News