క్షమాపణ కోరేందుకు ప్రశాంత్ భూషణ్ ససేమిరా.. శిక్ష ఖరారు వాయిదా వేసిన సుప్రీం కోర్టు!

Prashanth bhushan case: ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

Update: 2020-08-26 03:06 GMT

ప్రశాంత్ భూషణ్ కేసులో తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీం కోర్టు. కోర్టులపై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ భూషణ్ ను శిక్షించాలంటూ దాఖలైన కేసులో మంగళవారం వాదనలు ముగిసాయి.

ఈ కేసులో భూషణ్ ఎలాంటి దోపిడీలు, హత్యలు చేయలేదని అందువల్ల ఎలాంటి మందలింపులు, హెచ్చరికలు లేకుండా వదిలేయాలని ఆయన తరుపున వాదించిన సినీయర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టును కోరగా, క్షమాపణ చెబితే తప్పేముందంటూ న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఇలా ఇరువురి వాదనల మధ్య ఆయనపై శిక్ష ఖరారును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

కోర్టు ధిక్కార కేసులో లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖరారు తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన ప్రశాంత్‌ భూషణ్‌ క్షమాపణ చెప్పడానికి ససేమిరా అంటూనే తనని దోషిగా ఇచ్చిన తీర్పుని రీకాల్‌ చేయాలని మంగళవారం కోర్టుని అభ్యర్థిం చారు. భూషణ్‌ను ఇంతటితో వదిలేయాలని ఆయన తరఫున న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ కోరారు. మరోవైపు అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ కూడా భూషణ్‌ని క్షమించి వదిలేయాలని, అయితే ప్రశాంత్‌ భూషణ్‌ తన ట్వీట్లన్నీ వెనక్కి తీసుకోవాలని వాదించారు.

భూషణ్‌ని క్షమించాలి: లాయర్‌ వాదనలు

ప్రశాంత్‌ భూషణ్‌ తరఫున హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ ధావన్‌ సుప్రీం కోర్టు ప్రశాంత్‌ భూషణ్‌ని ఎలాంటి హెచ్చరికలు, మందలింపులు లేకుండా వదిలేయాలన్నారు. భూషణ్‌ ఎలాంటి దోపిడీలు, హత్యలు చేయలేదని అన్నారు. న్యాయస్థానం తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తేనే ఈ వివాదం ముగుస్తుందని చెప్పారు. ఈ వాదనలు విన్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ''మీరు ఒకరి మనసు గాయపరిచినప్పుడు క్షమాపణ చెపితే తప్పేంటి'అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ప్రశ్నించారు. ''న్యాయవ్యవస్థని కించపరిచేలా విమర్శలు చేస్తూ ఉంటే ఎంతకాలం భరించాలి? మీరు ఎవరినైనా గాయపరిస్తే, గాయానికి మందు పూయాల్సిందే''అని స్పష్టం చేశారు.

విమర్శల్లో నిజాయితీ ఉండాలి

''విమర్శలనేవి నిజాయితీగా చేస్తే ఇబ్బందేమీ ఉండదు. వ్యవస్థకీ మంచి జరుగుతుంది. కానీ ఒక న్యాయవాదే తోటివారిపై నిందలు వేస్తూ ఉంటే, ఈ వ్యవస్థపై ప్రజలకి నమ్మకం ఎందుకు ఉంటుంది''అని మిశ్రా వ్యాఖ్యానిం చారు. మంగళవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాక కూడా సుప్రీం బెంచ్‌ క్షమాపణ చెప్పడానికి ప్రశాంత్‌ భూషణ్‌కి అరగంట గడువు ఇచ్చింది. అయినా ఆయన తాను చేసిన ట్వీట్లలో తప్పేం లేదనే వాదించారు. సుప్రీంకోర్టు కుప్పకూలిపోయిందని భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించిన జస్టిస్‌ మిశ్రా శిక్ష ఖరారుని వాయిదా వేశారు.

Tags:    

Similar News