కాంగ్రెస్‌లో చేరికపై కాసేపట్లో పీకే కీలక నిర్ణయం.. 600స్లైడ్స్‌తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
Prashant Kishor: సోనియాగాంధీతో నిర్ణయాన్ని వెల్లడించనున్న పీకే...
Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది. ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో జరిగే సమావేశంలో తుదినిర్ణయం ప్రకటించనున్నారు.. సుమారు 600 స్లయిడ్స్‌తో సోనియా ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పీకే సిద్ధమయ్యారు. 2024లో తొలిసారిగా ఓటు వేసిన 13 కోట్ల మందిపై దృష్టి పెట్టడంతో పాటు, కాంగ్రెస్‌కు లోక్‌సభ, రాజ్యసభల్లో 90 మంది ఎంపీలు, దేశంలో 800 మంది ఎమ్మెల్యేలున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపెట్టనున్నారు. 3 రాష్ట్రాల్లో అధికారం.. మరో 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు, 13 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. 1984 నుంచి కాంగ్రెస్‌కు ఓట్ల శాతం ఎలా తగ్గుతూ వచ్చిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు.
దేశ రాజకీయ రంగంలో కాంగ్రెస్ ప్రస్తుత స్థితిని, పార్టీ బలాలు, బలహీనతలపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ సవరించుకోవాల్సిన అంశాలను పార్టీ నేతల ముందుంచనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తన నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి. కూటమి సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మునపటి ఆదర్శాలకు తిరిగి రావాలి. అట్టడుగు కార్యకర్తలు, నాయకులతో కమ్యూనికేషన్ వ్యవస్థను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ సూచించనున్నారు.