CSIR-UGC-NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష వాయిదా..కారణం ఇదే
CSIR-UGC-NET 2024: నీట్,నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీల వివాదం మధ్య, NTA CSIR-UGC-NET పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష జూన్ 25 నుంచి జూన్ 27 మధ్య జరగాల్సి ఉంది.
CSIR-UGC-NET 2024: నీట్, నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకల ఆరోపణలపై వివాదం కొనసాగుతుండగానే ఎన్టీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పరీక్షను వాయిదా వేయడానికి వనరుల కొరతే కారణమని పేర్కొంది. కొత్త తేదీని అభ్యర్థులకు త్వరలో తెలియజేస్తామని ఎన్టీఏ తెలిపింది.ఎన్‌టిఎ సర్క్యులర్‌ను జారీ చేస్తూ, 'జూన్ 25 నుండి 27 మధ్య జరగాల్సిన సిఎస్‌ఐఆర్-యుజిసి సంయుక్త నెట్ పరీక్ష జూన్-2024, అనివార్య పరిస్థితులతో పాటు లాజిస్టిక్ సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపింది . ఈ పరీక్ష నిర్వహణ కోసం సవరించిన షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తర్వాత ప్రకటిస్తారు. అభ్యర్థులు అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలని అభ్యర్థించారు.కాగా పరీక్ష వాయిదాపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఏ యువతకు గాయం చేసే నరేంద్ర ట్రామా ఏజెన్సీగా మారిందంటూ విమర్శించారు.
CSIR UGC NET పరీక్ష అంటే ఏమిటి?
ఉమ్మడి CSIR UGC NET పరీక్ష UGC నిర్దేశించిన అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే భారతీయ పౌరులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు అర్హతను అందిస్తుంది.
యూజీసీ-నెట్ పరీక్ష జూన్ 19న రద్దు :
అంతకుముందు జూన్ 19న యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 20న, పరీక్షను రద్దు చేసిన ఒక రోజు తర్వాత, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది.