కరోనాతో కరువైన ఉపాధి.. పౌష్టికాహారానికి దూరంగా పేదలు

Update: 2020-09-30 11:00 GMT

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మానవాళికి నేర్పిన పాఠం ఇమ్యునిటీ. కరోనాను ఎదుర్కోవాలన్నా వ్యాక్సిన్ వచ్చే వరకు రోగనిరోధక శక్తే మందు. అందుకే డాక్టర్ల నుంచి సైంటిస్టుల దాకా చెబుతున్న ఒకే ఒక్క మాట పౌష్టికాహారం. కంచంలో ఇమ్యునిటీ పెంచే పోషకాలుంటేనే కరోనా మీ దరి చేరదని సూచిస్తున్నారు. వినడానికి బాగున్నా ఇది ఎంతవరకు సాధ్యం పూట గడవని పేదలకు అందని ద్రాక్ష లాంటి పౌష్టికాహారం దక్కుతుందా..?

కరోనా బారిన పడకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని నిపుణులు ముందునుంచీ సూచిస్తున్నారు. కానీ అది అందరికి సాధ్యమేనా అంటే కష్టమనే చెప్పాలి. లాక్‌డౌన్‌తో మారిన పేదల బతుకు చిత్రం పౌష్టికాహారానికి వారిని మరింత దూరం చేసింది. ఐసీఎంఆర్‌ సూచించినట్లు పోషకాహారం తినాలంటే ఓ వ్యక్తి 275 నుండి 300 రూపాయలు ఖర్చు చేయాలి. అయితే దేశంలో ఎక్కువ శాతం రైతు కుటుంబాలు సన్న, చిన్నకారువే. కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందేవారు కూడా అధికంగా ఉన్నారు. తక్కువ వేతనంతో పనిచేసే వారు జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. వీరి పరిస్థితి లాక్‌డౌన్‌తో మరింత దయనీయంగా మారింది. దీంతో ఐసీఎంఆర్‌ చెప్పినట్లు పౌష్టికాహారానికి అంత ఖర్చు చేయలేమంటున్నారు.

కొవిడ్‌ సంక్షోభం వల్ల ఉద్యోగాలు, ఉపాధి పోయి చాలామందికి ఆదాయం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక శక్తినిచ్చే పోషకాహారం కొని తినడం పేదలు, అల్పాదాయ వర్గాలకు కష్టసాధ్యమే అవుతుంది. రోజువారీ ఆహార పదార్థాల్లో ఎక్కువశాతం పోషకాలు, ప్రొటీన్లు ఉండేవాటి వాడకం పెంచాలని సూచిస్తున్నా అది పేదలకు కష్టతరం అవుతుందని పౌష్టిక ఆహార నిపుణులు చెబుతున్నారు. చౌకగా లభించే పోషకాలపై అవగాహన కల్పించడంతోపాటు, చౌక దుకాణాల ద్వారా పప్పులు, నూనెలు, తృణధాన్యాలను అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.

Full View



Tags:    

Similar News