రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి.. ఓటేసిన 99 శాతం మంది ప్రజాప్రతినిధులు
*21న రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు *25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం
Presidential Elections 2022: దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక ముగిసింది. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఎంపీలు, ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఆవరణల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు ఎమ్మెల్యేలు ఓటేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అయితే అధికార పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు. 21న ఓట్ల లెక్కింపుతో అధికారికంగా రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 24న ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్నది. ఆ మరునాడే కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు.
దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 4వేల 796 మంది ఓటర్లు ఉన్నారు. ఓవరాల్‌గా 99 శాతం మంది రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చత్తీస్‌ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదయ్యయింది. పార్లమెంట్‌లో 736 మందికి గాను 728 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, మంత్రి గంగుల కమలాకర్, ఏపీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక్కడ 117 మంది ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి నుంచి ఒక ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో 98.85 శాతం పోలింగ్ నమోదయ్యింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఏపీలో 173 మంది ఓటేశారు. ఇక ఈ ఎన్నికలను సిరోమణి అకాలీదళ్ బహిష్కరించింది.
బ్యాలెట్ బ్యాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల అసెంబ్లీల నుంచి ఢిల్లీకి తరలింపు చేపట్టింది. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే రాజధాని చుట్టు పక్కల రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు తాజాగా రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. 21న ఓట్ల లెక్కించి.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమేనని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్‌తో పాటు చివరి నిమిషంలో శివసేన ద్రౌపది ముర్ముకే ఓటేయాలని నిర్ణయించుకోవడమే కారణమని వివరిస్తున్నారు. అస్సాంలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ బిష్ణోయ్, ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ మోఖిమ్, గుజరాత్‌కు చెందిన ఎస్పీ ఎమ్మెల్యే కందల్‌భాయ్ జడేజా, తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్క కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరుగుతున్న ప్రతి ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బీజేపీ తరఫున నిలబడితే గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ద్రౌపది ముర్ము ఎన్నికను కూడా సీరియస్‌గా తీసుకుంది. భారీగా ప్రచారం నిర్వహించింది. ముర్ముదే విజయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తే.. రాష్ట్రపతి పదవిని పొందిన తొలి గిరిజన వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు. ఇదే కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో మహిళగా కూడా రికార్డులకు ఎక్కనున్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పని చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దళిత వర్గానికి చెందినవారు. ఆయన 24న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి 25న బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టిసారించాయి. ఎన్‌డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంటన ప్రదాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. తాజాగా విపక్షాల అభ్యర్థిగా గోవాకు చెందిన మార్గెట్ అల్వాను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఆమె వెంట కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవర్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనున్నది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయితే ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాక్, జార్గండ్ సీఎం హేమంత్ సొరేన్.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు మద్ధతు ఇస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపకషాలు అన్నీ ఏకమైతే మాత్రం.. ఉప రాష్ట్రపతి పదవిని దక్కించుకోవడం బీజేపీకి కష్టమే.