Hemant Soren: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న సీఎం హేమంత్ సోరెన్
Hemant Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
Hemant Soren: జార్ఖండ్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం హేమంత్ సోరేన్ ఇవాళ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా శాసనసభలో తన బల నిరూపణకు సిద్ధమయ్యారు. తన శాసన సభ్యత్వ అనర్హత సమస్య కారణంగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హేమంత్... అసెంబ్లీయే సరైన వేదిక అని భావిస్తున్నారు. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సోరెన్ గట్టెక్కుతారు. కానీ అధికార కూటమికి అంతకంటే ఎనిమిది మంది ఎక్కువే బలం ఉంది.
ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉండేలా కాంగ్రెస్, జేఎంఎం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని రిసార్ట్ లో మకాం వేసిన అధికార పార్టీ యూపీఏ కూటిమి ఎమ్మెల్యేలు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ప్రతిపక్ష బీజేపీ కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని యూపీఏ మ్మెల్యేలు గవర్నర్ ను కోరారు. ఇవాళ అసెంబ్లీ ఏం జరుగుతుందన్న దానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాల దృష్ట్యా జార్ఖండ్ లో ఏమైనా జరగొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌కు సూచించారు. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తేలనున్నది.