మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు.. కొంచెం అయితే..

Uttar Pradesh: అదొక స్మార్ట్ సిటీ పేరుకు మాత్రమే అక్కడి మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి.

Update: 2022-06-20 15:00 GMT

మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు.. కొంచెం అయితే..

Uttar Pradesh: అదొక స్మార్ట్ సిటీ పేరుకు మాత్రమే అక్కడి మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. వర్షం వచ్చిందంటే నదులను తలపించే ఆ నగరంలో తాజాగా ఓ పోలీసు, అతడి భార్య స్కూటర్‌తో డ్రైనేజీలోకి పడిపోయారు. ఈ సంఘటన యూపీలోని అలీఘడ్‌ మున్సిపాలిటీలో జరిగింది. నగరానికి చెందిన పోలీసు అధికారి దయానంద్‌ సింగ్‌ తన భార్యను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. అప్పటికే నగరంలో కురిసిన వర్షానికి డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో అనుకోకుండా వరద నీటి అడుగున నోరు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్కూటర్‌ సహా భార్యతో దయానంద్‌ సింగ్‌ డ్రైనేజీలో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని బయటకు లాగారు. దీంతో ప్రమాదం తప్పింది.

అయితే అక్కడొక మ్యాన్‌హోల్‌ ఉందని తమకు తెలియదని పోలీసు అధికారి దయానంద్‌ తెలిపారు. తాను, భార్య కేవలం గాయాలతో బయటపడినట్టు పోలీసు తెలిపారు. ఈ వీడియోను రిటైర్డ్‌ ఐఏఎస్‌ సూర్య ప్రతాప్‌సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. యూపీలోని అలీఘర్‌ను ఇంత స్మార్ట్‌ సిటీగా మార్చినందుకు ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో? అంటూ వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. స్మార్ట్‌ సిటీలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర పట్టణాల పరిస్థితి ఏమిటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం మ్యాన్‌హోల్‌ ఉందని ఇండికేటరైనా పెట్టొచ్చు కదా.. అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News