దళిత యువకుడి పెళ్లికి భారీ భద్రత.. తరలివచ్చిన మూడు స్టేషన్ల పోలీసులు..
Operation Samanta: ఓ కుగ్రామంలోని దళిత యువకుడి బరాత్‌కు మూడు స్టేషన్ల పోలీసులు భద్రత కల్పించారు.
Operation Samanta: ఓ కుగ్రామంలోని దళిత యువకుడి బరాత్‌కు మూడు స్టేషన్ల పోలీసులు భద్రత కల్పించారు. ఏకంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ భద్రతను పర్యవేక్షించారు. దీంతో అశ్వంపై ఎంతో సంతోషంగా వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుని.. వధువు మెడలో తాళి కట్టాడు. అయితే ఆ వరుడు బాగా పేరున్న వ్యక్తి అనుకుంటే పప్పులో కాలేసినట్టే అసలు విషయం ఏమిటో మీరే తెలుసుకోండి.
రాజస్థాన్‌లో ఇటీవల తరచూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. పైగా బరాత్‌లో అశ్వంపై వరుడి ఊరేగింపును అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకుంటున్నారు. వరుడి కుటుంబ సభ్యులు, బంధువులపై దాడులకు దిగుతున్నారు. అగ్రవర్ణాల ఆధిపత్య గ్రామాల్లో ఇది నిత్యకృత్యంగా మారింది. దీంతో ఆపరేషన్ సమంతా పేరిట దళితుల వివాహాలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.
బుండీ జిల్లాలోని చాడీ గ్రామానికి చెందిన 27 ఏళ్ల శ్రీరామ్ మేఘ్వాల్‌కు ద్రోపది అనే యువతితో వివాహం నిశ్చయమైంది. చాడీ గ్రామం అగ్రవర్ణాల ఆధిపత్యం కావడంతో మూడు స్టేషన్లకు చెందిన 66 మంది పోలీసులు, వివిధ స్థాయిల పోలీసు అధికారులతో పాటు ఎస్పీ చాడీ గ్రామంలో భద్రత కల్పించారు.
పోలీసుల భద్రత కల్పించడంతో డీజే సౌండ్లతో బరాత్ సంతోషంగా సాగింది. తమ వివాహ వేడుకకు పోలీసులు భద్రత కల్పించడంతో వధూవరులు, ఇరువైపు బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సాయం సమానత్వానికి తొలి అడుగుని వరుడు శ్రీరామ్ తెలిపాడు. దళితుల పెళ్లిళ్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ జై యాదవ్ హెచ్చరించారు.