Narendra Modi: బెర్లిన్‌లోనూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు...

Narendra Modi: రాజీవ్‌ హయాంలో రూపాయి ఇస్తే ప్రజలకు 15 పైసలే అందేదని విమర్శలు...

Update: 2022-05-03 10:19 GMT

Narendra Modi: బెర్లిన్‌లోనూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు...

Narendra Modi: కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదాన్ని ఎత్తుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సందు దొరికిన ప్రతిసారీ కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నాయకులపై రెచ్చిపోతారు. వేదిక ఏదైనా, ఏ ప్రాంతమైనా కాంగ్రెస్‌ తుక్కు రేగొడుతారు. పాత విషయాలను కెలికి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తారు. కాంగ్రెస్‌ను విమర్శించడంలో మోదీ తరువాతే ఎవరైనా అనేలా ఉంటాయి. తాజాగా బెర్లిన్‌లోనూ ప్రవాస భారతీయులతో సమావేశంలోనూ కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.

భారత్‌లో నిధుల తరలింపు విషయమై మాట్లాడుతూ.. రూపాయి కేటాయిస్తే 15 పైసలే ప్రజలకు చేరేదని.. మిగతాది గతంలో తమ జేబుల్లోకి వేసుకునేవారని మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. మూడ్రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తొలిరోజు జర్మనీ రాజధాని బెర్లిన్‌ చేరుకున్నారు. ప్రధాని మోదీ జర్మనీలో అడుగుపెట్టగానే.. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బెర్లిన్‌లోని ప్రఖ్యాత బ్రాండెన్‌బర్గ్‌ గేట్‌ వద్ద పిల్లలు, పెద్దలు, సహా అనేక మంది భారతీయులు తెల్లవారుజాము నుంచే ఎదురుచూశారు.

ప్రధాని గేట్‌ వద్దకు రాగానే.. వందేమాతరం.. భారత్‌ మాతాకీ జై.. అంటూ హర్షధ్వానాలు చేశారు. అనంతరం ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే.. రాజకీయ స్థిరత్వం అవసరమన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు ఈవీఎం బటన్‌ నొక్కి.. ప్రజలు తెరదించారన్నారు. 21వ శతాబ్దం భారత్‌కు ఎంతో ముఖ్యమన్నారు. భారత్‌ దృఢ సంకల్పంతో కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకెళ్తుందన్నారు. దేశంలో నాణ్యమైన జీవన సౌలభ్యం, ఉపాధి, మంచి విద్యా, సులభ వ్యాపారాలు, నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నట్టు మోదీ స్పష్టం చేశారు.

న్యూ ఇండియా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. 2014లో 200 నుంచి 400 స్టార్టప్‌లు ఉండేవని.. ఇప్పుడు దేశంలో 68వేల స్టార్టప్‌లు ఉన్నాయని.. డజన్ల కొద్ది యూనికార్న్‌లు వెలిశాయన్నారు. పలు స్టార్టప్‌లు డెకా యూనికార్న్‌లుగా కూడా మారాయన్నారు. విజయవంతమైన డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే చెల్లింపుల్లో 40శాతంపైగా భారత్‌ నుంచే ఉన్నాయని స్పష్టం చేశారు. డిజిటల్‌ పేమెంట్‌తో ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజీవ్‌ గాంధీ హయాంలో రూపాయిని ప్రజలకు కేటాయిస్తే.. అందులో 15 పైసలు మాత్రమే అందేదన్నారు. మిగతా 85 పైసలు జేబుల్లోకి వేసుకునేవారని ఆరోపించారు. ఇప్పుడు అలా జరగదని.. ఒక్క బటన్‌ నొక్కి.. నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఇక యూరోప్‌ పర్యటనలో తొలిరోజు జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ‌‌తో తొలుత ముఖాముఖి చర్చలు జరిపారు. ఆ తరువాత ఇర దేశాల ప్రతినిధుల సంప్రదింపులు కొనసాగాయి. ఆ తరువాత ఇరు దేశాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఏ దేశమూ విజయం సాధించలేదన్నారు. విజేతలు ఉండరని.. ఈ రణంలో చివరికి మిగిలేది ఫెను విషాదం, విధ్వంసమేనన్నారు.

యుద్ధం వల్ల కలిగే కష్ట నష్టాలను అందరూ అనుభవించాల్సి వస్తుందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి సామరస్యాలను పాటిస్తూ... పరస్సర చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్‌, రష్యా దేశాలకు భారత్‌ తొలి నుంచి చెబుతోందని గుర్తు చేశారు. అయితే ఒలాఫ్‌ మాత్రం... ఉక్రెయిన్‌పై దాడితో రష్యా అంతర్జాతీయ న్యాయ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. మోదీ పర్యటనలో రెండో రోజు.. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు వెళ్లనున్నారు. అక్కడ నార్వే, స్వీడన్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌ నేతలతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 4న పారిస్‌కు చేరుకుని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు పడనున్నాయి.

Tags:    

Similar News