మోడీ చేతుల మీదుగా రేపు పార్లమెంట్ నూతన భవనానికి భూమిపూజ

Update: 2020-12-09 16:15 GMT

మరో అద్భుతానికి రేపు నాంది పడబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనానికి రేపు భూమిపూజ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉండబోతుంది.

ప్రధాని మోడీ చేతుల మీదుగా గురువారం పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరగనుండగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భవనం 2022 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్త భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 2022లో స్వాతంత్ర్యం దినోత్సవ 75వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా అంటున్నారు.

నూతన పార్లమెంట్ భవనంలో వెయ్యి 224 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. పాత పార్లమెంటు భవనానికి ఏమాత్రం తీసిపోకుండా అన్ని వసతులతో సౌకర్యవంతంగా కొత్త బిల్డింగ్ ఉండబోతోందని కేంద్రం అంటోంది. భారతదేశ భిన్న సంస్కృతులకు ప్రతిరూపంగా కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనం శంకుస్థాపనకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని నిర్మించి దాదాపు వందేళ్లు పూర్తి కావొస్తోంది.

పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లో 60వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించబోతున్న నూతన భవన నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టును, ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సంస్థ దక్కించుకుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులతో త్రిభుజాకారంగా దీన్ని నిర్మించనున్నారు. ఇక అటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమి పూజ జరగబోతున్న సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెప్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలుస్తుందన్నారు. లుట్యెన్స్ జోన్‌లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేస్తారు. 

Tags:    

Similar News