PM Modi: ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

PM Modi: స్వతంత్ర్య సమరయోధులకు దేశం సెల్యూట్‌ చేస్తోంది -మోడీ

Update: 2021-08-15 04:29 GMT
ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ 

PM Modi: శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. 75వ స్వాతంత్ర్య దినోస్తవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోడీ.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షులు తెలిపారు మోడీ.

స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోందని అన్నారు ప్రధాని మోడీ. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీరజవాన్లకు ఆయన ప్రణామాలు తెలిపారు. కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం అన్న మోడీ.. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఇక.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా నేటి నవయువతకు స్ఫూర్తి అని, పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు.

కరోనా మహమ్మారిపై దేశం యుద్ధం చేస్తోందని మోడీ చెప్పారు. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినపుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తిందని, భారత్‌ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం వచ్చిందన్నారు. కానీ.. వాటన్నింటినీ తలకిందులు చేస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాలు తక్కువేనని అన్నారు మోడీ. మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయని, ఇప్పటివరకు 54కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు.

రానున్న 25ఏళ్లు అమృత ఘడియలన్న మోడీ ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి సంకల్పించుకోవాలన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో వచ్చే ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగూ కీలకమవ్వాలన్నారు. ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు మోడీ. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌.. ఇదే మన నినాదం కావాలన్నారు. పౌరులందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుందని చెప్పారు మోడీ.

ఈ ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు ప్రజల ముంగిటకు చేరాయన్న మోడీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు హక్కుదారులకు వందశాతం చేరేలా కృషిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్‌, తాగునీరు అందించడం మనందరి బాధ్యత అని చెప్పిన మోడీ.. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి వివక్షకు తావుండకూడదన్నారు. సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అన్న మోడీ.. ఏ ఒక్కరూ ఈ లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. 

Tags:    

Similar News