PM Modi: దేశం గర్విస్తోంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా..
నేను గ్రీస్‌లో ఉన్నా... నా మనసంతా ఇక్కడే ఉంది- మోడీ
PM Modi: చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ నినాదం ఇచ్చారు. ‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్ - 3 విజయంపైనే ఉంది. విజయం పట్ల శాస్త్రవేత్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది’’ అని తెలిపారు.